తెలంగాణలో కొత్తగా మరో 18 కేసులు

తెలంగాణలో ఈరోజు కొత్తగా మరో 18 కరోనా కేసులు లెక్కతేలాయి. మొత్తం 665 శాంపిల్స్ ను పరీక్షించగా వీటిలో 18 పాజిటివ్ కేసులున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది. ఈరోజు ఒకరు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

“665 శాంపిల్స్ లో 18 పాజిటివ్స్ వచ్చాయి. తెలంగాణలో మొత్తంగా 471 పాజిటివ్ కేసులున్నాయి. వీటిలో 385 మంది మర్కజ్ ప్రయాణికులు, వాళ్లతో కాంటాక్ట్ అయినవాళ్లు ఉన్నారు. ఈ 471 మందిలో 45 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 12 మంది చనిపోయారు.”

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న గాంధీ హాస్పిటల్ ను పూర్తిగా కరోనా హాస్పిటల్ గా మార్చినట్టు ఈటల ప్రకటించారు. ఓపీ కోసం వచ్చే వాళ్లను కోఠిలోని హాస్పిటల్ కు పంపిస్తున్నామని, కేవలం కరోనా అనుమానిత కేసుల్ని మాత్రం గాంధీలో చూస్తున్నారన్నారు. ప్రస్తుతం గాంధీ, ఛెస్ట్, కోఠి హాస్పిటల్స్ లో 414 మందికి కరోనా ట్రీట్ మెంట్ కొనసాగుతోందని మంత్రి స్పష్టంచేశారు.

“ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వాళ్లందరి శాంపిల్స్ ను టెస్టులకు పంపించాం.. ఆ ఫలితాలు రేపు వచ్చే అవకాశం ఉంది. అవి కూడా వస్తే మరో 60-70 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హాస్పిటల్స్ లో ఉన్న కరోనా బాధితుల్లో ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ మీద ఉన్నారు. మిగతావాళ్లంతా నార్మల్ గానే ఉన్నారు. ట్రీట్ మెంట్ కు ప్రతిస్పందిస్తున్నారు.”

ప్రస్తుతం కరోనా ట్రీట్ మెంట్ పొందుతున్న వాళ్లంతా (వెంటిలేటర్ పై ఉన్న వ్యక్తి మినహా) ఏప్రిల్ 22 నాటికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఈటల ఆశాభావం వ్యక్తంచేశారు. మర్కజ్ ప్రభావం లేకపోయి ఉంటే ఈపాటికి తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్ అయ్యేదని అభిప్రాయపడ్డారు.

మరో 2 రోజుల్లో టెలీమెడిసిన్ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నామని, ఏమైనా సమస్యలుంటే ప్రజలు నేరుగా ఆ నంబర్ కు ఫోన్ చేసి మాట్లాడొచ్చన్నారు. ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా.. మానసిక సమస్యలున్న వాళ్లు కూడా ఆ నంబర్ కు ఫోన్ చేయొచ్చన్నారు ఈటల. రేపు ఆ నంబర్ ను ప్రకటిస్తామన్నారు.