న్యూయార్క్ టైమ్స్ మీద ట్రంప్ కు ఎందుకంత కోపం వచ్చింది?

అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో మీడియా మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ట్రంప్ సర్కారుతోనే షురూ అయ్యిందని చెబుతారు. ప్రపంచంలోని పలుదేశాలతో పోలిస్తే..అమెరికాలో మీడియాకు కాస్త స్వేచ్ఛ ఎక్కువే. అదే సమయంలో తమకు గిట్టని వారి విషయంలో మీడియా అనుసరించే ధోరణిని అక్కడి వారు తప్పు పడుతుంటారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి మీడియాను తన తొలి ప్రత్యర్థిగా ఫీల్ కావటం మాత్రం ఎప్పుడూ జరిగింది లేదని చెప్పాలి.

తనను ఇరుకున పెట్టే ప్రశ్నను సంధించే మీడియా రిపోర్టర్ గాలి తీయటమే కాదు.. వారిని నోటికి వచ్చినట్లుగా తిట్టేసే తత్త్వం.. సదరు రిపోర్టరు ప్రాతినిధ్యం వహించే మీడియా సంస్థపై నిప్పులు చెరగటం ట్రంప్ కు అలవాటే. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రఖ్యాత మీడియాసంస్థ న్యూయార్క్ టైమ్స్ పత్రిక తాజాగా ప్రచురించిన కథనం సంచలనంగా మారటమే కాదు.. ట్రంప్ కు తీవ్రమైన కోపం వచ్చేలా చేసింది.

ఇంతకూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన ఆ కథనం ఏమిటన్న వివరాల్లోకి వెళితే.. అమెరికాలో అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా కేసులకు కారణం చైనా కాదని.. యూరప్ దేశాలుగా ఆ పత్రిక ఒక కథనం రాసింది. కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ గా అభివర్ణించే ట్రంప్ లాంటి అధినేతకు న్యూయార్క్ టైమ్స్ లో అచ్చేసిన తాజా కథనం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అది కూడా ఎంతలా అంటే?.. ‘‘ఏం రాయటం ఇది. ఏం రాస్తున్నారు మీరు? న్యూయార్క్ టైమ్స్ మరో తప్పుడు వార్తను రాసింది. కరోనా వైరస్ పుట్టింది చైనాలో కాదట. యూరప్ లోనేట. ఈ పనికిమాలిన న్యూయార్క్ టైమ్స్ ఎందుకిలా రాస్తుందో నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఈ వార్తకు బలమైన సోర్స్ ఏదైనా ఉందా?’’ అని ప్రశ్నించారు.

అంతేకాదు.. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ చైనాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వారిని కుక్కల్ని విసిరేసినట్లుగా విసిరేసిందని.. అందుకే చైనాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఇలా రాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ట్రంప్. అమెరికాలోకి వచ్చిన కరోనా వైరస్ కేసులన్ని యూరప్ నుంచే వచ్చాయని.. చైనా నుంచి కాదని.. జన్యువుల వల్ల ఈ విషయం తెలుస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది. ఫిబ్రవరి మధ్యలో యూరప్ దేశాల నుంచి అమెరికాకు భారీ సంఖ్యలో వచ్చిన వారి వల్లే కరోనా వైరస్ వ్యాపించినట్లుగా సదరు పత్రిక పేర్కొంది. అయితే.. చైనాలో కరోనా వైరస్ స్టార్ట్ అయ్యాక వుహాన్ నుంచి నాలుగు లక్షల మంది అమెరికాకు వచ్చారని.. ఆ విషయాన్ని వదిలేసి.. యూరప్ దేశాల మీద పడటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. మొత్తానికి ఇటీవల కాలంలో ఎఫ్పుడూ లేనంత తీవ్ర పదజాలంతో న్యూయార్క్ టైమ్స్ సంస్థ మీద ఫైర్ అయ్యారు ట్రంప్.