వైరల్: క్వారంటైన్ పిల్లో ఛాలెంజ్

కరోనా వైరస్ విజృంభణతో పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ ప్రకటించని దేశాలలో కూడా ప్రజలు జన సందోహం ఉండే ప్రాంతాలలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువమంది ప్రజలు ఇంట్లోనే ఉండడంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తాట తీస్తున్నారు. సీరియల్స్ ఆగిపోవడంతో లేడీస్ బాధగానూ.. జెంట్సు మహానందంగానూ ఉన్నారు. ఇక మీడియా చూస్తే ప్రతి నిముషానికి కరోనా లైవ్ స్కోర్ అందిస్తూ కరోనా కల్లోలంలేని మెరుగైన సమాజ స్థాపనకు తెగ పాటుపడుతోంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎక్కువమంది ఖాళీగా ఉండడంతో క్రియేటివిటీ పీక్స్ లో ఉంటోంది. కొత్త కొత్త ఛాలెంజిలు పుట్టుకొస్తున్నాయి.

మహాకవి శ్రీశ్రీ ‘కాదేదీ కవితకనర్హం’ అన్నారు. చైనా వారికి అది ‘కాదేదీ తినటానికి అనర్హం’ అని అర్థం అయింది. అన్ని జంతువులను.. పక్షులను గట్టిగా తగులుకున్నారు. ఇక నెటిజెన్లేమో ‘కాదేదీ ఛాలెంజిలకు అనర్హం’ అని డిసైడ్ అయ్యారు. రోజూ ఏదో ఒక ఛాలెంజ్ తో ముందుకు వస్తున్నారు కానీ ఈ ‘క్వారంటైన్ పిల్లో ఛాలెంజ్’ మాత్రం తెగ పాపులర్ అయింది. ఇంతకీ ఈ ఛాలెంజ్ కథాకమామీషు ఎట్టిదనిన.. మనం పడుకునే సమయంలో తలకింద ఓ దిండు పెట్టుకుంటాంకదా.. ఆ దిండును మనం డ్రెస్ లాగా ధరించాలి. దీన్ని ఎలా ధరిస్తున్నారంటే అమ్మాయిలు లేదా అబ్బాయిలు తమ శరీరం ముందుభాగం లో ఒక పిల్లో ను పెట్టుకుని. ఒక బెల్ట్ తోనో లేదా తాడుతోనో ఊడిపోకుండా గట్టిగా కట్టుకుంటారు. పెద్దవారు కూడా ఈ ఛాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ వింత వస్త్రధారణలో సెల్ఫీలు..ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇతరులకు ఈ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇన్స్టా లో ఈ ఛాలెంజ్ ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది.

అంతా బాగానే ఉంది కానీ “నాకు తల కింద దిండు పెట్టుకునే అలవాటు లేదు.. మా తాత కూడా అంతే’ అని పుసుక్కున అనకండి. మీకు ఇంకో డౌట్ కూడా రావొచ్చు. పిల్లో ను ముందు పెట్టుకుంటే బ్యాకెండ్ టెక్నాలజీ సంగతి ఏంటి? దయచేసి వెనక పెద్ద అద్దం లేకుండా చూసుకోండి. లేకపోతే గుండె జబ్బులు గట్రా ఉన్నవారికి ఏ బాల్కనీ నుంచో మీ బ్యాక్ గ్రౌండ్ కనపడకుండా జాగ్రత్తలు తీసుకోకండి. ఇతర దేశాలలో ఈ ఛాలెంజ్ ఎక్కువగా పాపులర్ అయింది. ప్రస్తుతానికి అయితే ఇండియాలో ఎక్కడా కనబడడం లేదు. త్వరలోనే ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కొందరు సంప్రదాయవాదులు ఇలాంటివి క్వారంటైన్ పిల్లో ఛాలెంజులు మన సంప్రదాయం కాదని విరుచుకుపడుతున్నారు. కరోనాకాలంలో కూడా వీళ్లకు కాసింతైనా కలాపోసన లేదేంటా అని పైనున్న రావు గోపాలరావు కూడా బాధ పడుతుంటారేమో. అయినా ఈ ఛాలెంజ్ లు పిల్లో ఛాలెంజ్ తో ఆగుతాయా లేక కర్చీఫ్ ఛాలెంజ్.. గోచి ఛాలెంజ్ అంటూ హాట్నెస్ ను పెంచుకుంటూ పోతాయా? ఏమో .. మీరైతే పక్కింటి వెనకింటి ఎదురింటి.. కిందింటి కిటికీల్లో చూసే సమయంలో జాగ్రత్తగా ఉండండబ్బా..!