సోదరుడి అంత్యక్రియలు వీడియో కాల్‌లో…

బంజారాహిల్స్‌లాక్‌డౌన్‌లో పోలీసులు నిద్రాహారాలు మాని కుటుంబాలకు దూరమై చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. మేమున్నామంటూ పోలీసులకు అండగా నిలుస్తున్నారు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అడ్మిన్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న బచ్చు శ్రీనివాస్‌ సోదరుడు రంజిత్‌(35) కేన్సర్‌తో మృతి చెందాడు. సోదరుడి మృతివార్త తెలుసుకున్న శ్రీనివాస్‌ వెళ్దామని అనుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో పీఎస్‌ వదిలి వెళ్లలేని పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా పోలీసులు విధుల్లో లేకపోతే లాక్‌డౌన్‌ పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం ఉండటంతో ఆయన స్టేషన్‌కే పరిమితం అయ్యారు. తన సోదరుడి అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసి కన్నీరు కార్చారు. పంటిబిగువన దుఃఖాన్ని దిగమింగుకొని విధులకే పరిమితం అయ్యారు. సోదరుడి అంత్యక్రియలకు వెళ్లకుండా ఆయన అంకితభావంతో విధుల్లోనే అంటిపెట్టుకొని ఉండిపోయాడు.