అదే జరక్కపోతే బాబు పరిస్థితి ఏంటి..?
అదే జరక్కపోతే బాబు పరిస్థితి ఏంటి..?

నాయకులు వెళ్లిపోతున్నా పార్టీని పట్టించుకోవడం లేదు, కొడుకు చేతికి అందిరాకపోయినా పెద్దగా బాధపడటం లేదు. ఏదో మూల చంద్రబాబుకి ఓ ఆశ ఇంకా మిగిలే ఉంది. 2024  ఎన్నికలనాటికి ఎలాగోలా వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూటమి కట్టాలనేది బాబు ఆశయం. బీజేపీ, జనసేన, వీలైతే వామపక్షాల మద్దతుతో మహా కూటమిగా బరిలో దిగాలని, జగన్ ని ఓడించాలని ఆయన కోరిక.

అందుకే గతేడాది ఘోర పరాభవం తర్వాత బాబు మెల్లగా తన వ్యూహం మార్చుకుంటూ వస్తున్నారు. బీజేపీని పల్లెత్తు మాట అనడంలేదు, అవకాశం దొరికితే ప్రధాని మోదీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఎన్డీఏ అడక్కపోయినా కేంద్రంలో బిల్లులకు మద్దతు తెలుపుతున్నారు. ఇటు రాష్ట్రంలో దత్తపుత్రుడిని అంతకంటే జాగ్రత్తగా చూసుకుంటున్నారు. 

పవన్ పై పల్లెత్తు మాట పడనీయడం లేదు. సీపీఐ పూర్తిగా చేతిలో చిక్కింది కానీ, సీపీఎంతో కాస్త తకరారు మిగిలే ఉంది. ఎలాగోలా వాళ్లని కూడా దారిలోకి తెచ్చుకోవచ్చనే నమ్మకం బాబుకి ఉంది.

అందుకే ఆయనంత ధీమాగా కనిపిస్తున్నారు. ఒంటరిగా బరిలో దిగి బాబు గెలిచినట్టు చరిత్రలో లేదు. ఆయన చేతిలోకి వచ్చాక టీడీపీ పూర్తిగా పరాన్నజీవిగా మారింది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీకి మనుగడ. టీఆర్ఎస్, బీజేపీ, జనసేన, వామపక్షాలు.. ఆఖరికి కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్న ఘన చరిత్ర బాబు హయాంలోని టీడీపీది.

బాబు అధికారంలో లేరు అంటే ఆ ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేశారనే అర్థం. 2019లో కూడా అందర్నీ దూరం చేసుకుని ఒంటరిగా బరిలో దిగి చరిత్రలో టీడీపీ ఎరుగుని దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. అందుకే 2024కల్లా ఎలాగైనా అన్ని శక్తుల్నీ కూడదీసుకుని జగన్ పై పోరాడేందుకు సిద్ధపడుతున్నారు.

మరి పరిస్థితులు బాబుకి అనుకూలంగా ఉన్నాయా అంటే అస్సలు లేవనే చెప్పాల్సి వస్తోంది. తాను ఆడిస్తున్న కన్నా లక్ష్మీనారాయణను పక్కనపెట్టి సోము వీర్రాజుకి రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించినప్పుడే బాబు పరిస్థితి అయోమయంలో పడింది. 

బాబుకి గోరుచుట్టుపై రోకలిపోటులా ఇప్పుడు పురందీశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించింది బీజేపీ. ఏపీలో బీజేపీ, టీడీపీ కలవడానికి పురందీశ్వరి అసలు ఒప్పుకుంటుందా? బీజేపీ ఒప్పుకోకపోతే జనసేన కూడా కలవదు. సీపీఐని కలుపుకొని బాబు చేసేదేమీ ఉండదు.

అందుకే బీజేపీ ప్రాపకం కోసం ఇన్నాళ్లూ అధినాయకత్వంపై ప్రేమ చూపిస్తోన్న టీడీపీ నేతలు, ఇప్పుడు కొత్తగా చిన్నమ్మని కూడా ఆకాశానికెత్తేస్తున్నారు. ఇలాంటి నక్కజిత్తులకు లొంగిపోయే రకం కాదు పురందీశ్వరి. బాబుతో వ్యవహారం చెడ్డ తర్వాత ఇంతవరకు ఆయన పొడ తగలకుండానే ఉన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

ఎన్టీఆర్ ఫ్యామిలీలో అందర్నీ తనవైపు తిప్పుకున్నా.. దగ్గుబాటి ఫ్యామిలీని మాత్రం చంద్రబాబు ఏమార్చలేకపోయారు. చిన్నమ్మ కూడా సందర్భం వస్తే చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడిపోతారు.

అలాంటి దశలో వచ్చే దఫా ఎన్నికలనాటికి ఏపీలో బీజేపీ, టీడీపీ కూటమి కట్టడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అదే జరక్కపోతే బాబు పరిస్థితి మరింత దిగజారడం ఖాయం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here