కాంగ్రెస్ కి పోటీ ఇచ్చే దిశగా టీడీపీ
కాంగ్రెస్ కి పోటీ ఇచ్చే దిశగా టీడీపీ

2024 ఎన్నికలనాటికి ఏపీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందనే అంచనాలున్నాయి. అధికార పక్షం అంతకంతకూ బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ ర్యాంక్ ఎటూ డిసైడ్ అవుతోంది కాబట్టి మిగతా ర్యాంకుల్లోనే పోటీ నెలకొని ఉంది. 

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీకి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే చేజారుతున్నారు. 23 నుంచి గ్రాఫ్ 19కి పడిపోయింది. 2024నాటికి వారిలో ఎంతమంది మిగిలుంటారో చెప్పలేని పరిస్థితి. పోనీ ఎన్నికల ముందు వరకు మిగిలే ఉన్నా.. ఎన్నికల్లో టికెట్ కోసం ఏ పార్టీ పంచన చేరతారో, ఏ గోడ దూకుతారో తెలియని పరిస్థితి.

కనీసం కమ్మ సామాజిక వర్గం కూడా టీడీపీని నమ్మే పరిస్థితిలో లేదు. గెలిచే పార్టీని నమ్ముకుంటే ఉపయోగం ఉంటుంది కానీ, కమ్మగా ఉంటుంది కదా అని టీడీపీతో ఎవరూ అంటకాగలేరు కదా. ఇక కాపులు ఎప్పుడో బాబుకి దూరమయ్యారు. మిగతావారిని సామాజిక లెక్కల ప్రకారం బీజేపీ, జనసేన వలేసిపట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. 

మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల్లో ఓ మోస్తరు పలుకుబడి ఉన్నవారు కూడా టీడీపీతో లేరు. అంటే దాదాపుగా 2024 నాటికి టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుందన్నమాట. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ తో పోటీపడబోతోంది తెలుగుదేశం.

2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ కి తగులుతుందని తెలిసి కూడా కొంతమంది హస్తం గుర్తుపై పోటీ చేశారు. ఎక్కడివాళ్లక్కడ ఏదో ఒక పార్టీలోకి సర్దుబాటైపోగా మిగులు జనాలు కాంగ్రెస్ తోనే ఉన్నారు. 

2019కి వచ్చే సరికి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. అభ్యర్థులే దొరకలేదు. పిలిచి టికెట్ ఇస్తామన్నా కూడా ఎవరూ ముందుకు రాలేదు. కనీసం ప్రజాశాంతి పార్టీ కేఏపాల్ కి అభ్యర్థులు దొరికారు కానీ, కాంగ్రెస్ కి దొరకలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా అదే అనుభవం 2024కి టీడీపీకి ఎదురవబోతోంది.

టీడీపీలోని నాయకులంతా మిగతా పార్టీల్లోకి క్రమక్రమంగా సర్దుకుంటున్నారు. స్థానిక ఎన్నికల లాంఛనం పూర్తయితే ఈ కప్పగంతులు బాగా ఉండేవి కానీ, ఆ తంతు మిగిలే ఉండటంతో కండవాల పండగ ఇంకా జోరందుకోలేదు. కార్పొరేషన్ పదవులు, స్థానిక ఎన్నికల్లో పదవుల కోసం ఎదురు చూసేవారంతా వైసీపీలోకి వెళ్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు వైసీపీలో ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి, టికెట్ ఆశించేవారు బీజేపీ, జనసేన వైపు చూస్తుంటారు.

ఇంకెవరైనా మిగిలుంటే టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు మీ నాయకత్వంలో పనిచేస్తామంటూ వైసీపీ, బీజేపీ గూటికి చేరతారు కానీ, పొరపాటున కూడా టీడీపీలో మిగిలి ఉండటానికి సుముఖంగా లేరు. మనసు చంపుకోలేక, పార్టీ మారలేక ఉన్నవారు కూడా క్రియాశీలకంగా ఉండటానికి ఇష్టపడరు. టీడీపీ మునిగిపోయే నావ అని తెలిసిన ప్రతి ఒక్కరూ పార్టీకి దూరంగా జరుగుతున్నారు.

2024కల్లా ఈ ప్రక్రియ మరింత వేగవంతం అయి, ఎన్నడూ లేని సంక్షోభంలో కూరుకుపోతుంది తెలుగుదేశం. సీట్లలో కానీ, ఓట్లలో కానీ, లీడర్లలో కానీ, క్యాడర్ లో కానీ.. కాంగ్రెస్ కి టీడీపీ కచ్చితంగా పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here