ఉత్తరప్రదేశ్‌లో హాథ్రన్కు చెందిన దళిత యువతి (19)పై నిర్భయ తరహా ఘటన దేశాన్ని కుదిపేస్తుండగానే, మరో దారుణం బీజేపీపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెంచుతోంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా సదరు బాధిత దళిత యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. బీజేపీ పాలనలో ఇంత దుర్మార్గమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రన్ జిల్లా బుల్గర్హి గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై గత నెల 14న సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ యువతి మంగళవారం తుదిశ్వాస విడిచింది. యువతి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు మంగళవారం రాత్రి భారీ బందోబస్తు మధ్య బాధితురాలి స్వగ్రామానికి తరలించారు.
అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండానే ,నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లాలని స్థానిక చంద్పా పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు ఒత్తిడి తెచ్చారని యువతి బంధువు ఆరోపించాడు. రాత్రి సమయంలో జరిపే ఆచారం లేదని చెప్పినా వినలేదన్నాడు. శ్మశాన వాటికలో రాత్రి 2.30-3.00 గంటల సమయంలో 30-40 మంది సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
యువతి కుటుంబ సభ్యులతో కలిసి హాథ్రస్ వస్తున్న భీమ్ ఆర్మీ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకొని షహరాన్‌పుర్‌లో గృహ నిర్బంధంలో ఉంచారు. దిల్లీ నుంచి 180 కిలోమీటర్ల దూరం ఉన్న బుల్గర్హికి యువతి తండ్రి కన్నా పోలీసులే ముందు చేరుకున్నారని ఆమె బంధువు ఒకరు తెలిపారు. ఇప్పుడు ఇదే వివాదమైంది.
తమ బిడ్డ మృతదేహానికి అర్ధరాత్రి అంత్యక్రియం నిర్వహించడం ఆచారం కాదని తాము అభ్యంతరం చెప్పినట్టు యువతి తండ్రి తెలిపాడు. దీంతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళుతూ తమనెవరినీ పోలీసులు దగ్గరికి కూడా రానివ్వలేదని యువతి తండ్రి వాపోయాడు. యువతి తండ్రిని, సోదరులను ఇంట్లోనే బంధించారు.
‘మా కుటుంబ సభ్యులందరినీ ఇంట్లోకి తోసేసి పోలీసులు తాళం వేశారు. కుమార్తె అంత్యక్రియలను మా చేతులతో నిర్వహించలేకపోయాం’ అని యువతి తండ్రి మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు. అంత్యక్రియలకు తీసుకెళ్లే ముందు కుమార్తె మృతదేహానికి పసుపు కూడా రాయనివ్వలేదని ఆమె తల్లి విలపించారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూపీ పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులిచ్చింది.
హాథ్రస్ నిర్భయ మరణించలేదని, ప్రభుత్వమే హత్య చేసిందని ట్వీట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆమె అంత్యక్రియలను ఆచారాలకు విరుద్ధంగా, అవమానకరంగా నిర్వహించడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ విమర్శించారు.
లఖ్‌నవూ, హాథ్రస్లలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, భీమ్ ఆర్మీ కార్యకర్తలు, దిల్లీలోని ఇండియా గేట్, యూపీ భవన్ వద్ద కాంగ్రెస్, వామపక్ష, భీమ్ ఆర్మీ పార్టీల నాయకులు ధర్నాకు దిగారు. కాగా యువతి చితి సమీపంలో పోలీసులు నిలబడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ కేవలం సాయుధులైన పోలీసులే ఉండడం, కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెల్లారి లేచినప్పటి నుంచి హిందూ మతానికి తామే ప్రతినిధులైమైనట్టు, ప్రతి అంశాన్ని మతం కోణంలో బీజేపీ నేతలు మాట్లాడ్డం చూస్తున్నాం. ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేసేందుకు హిందువుల మనోభావాల గురించి ఉపన్యాసాలు ఇచ్చే బీజేపీ … తాము పాలిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో అనుసరించిన విధానం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
మరి అక్కడ అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం వల్ల హిందువుల, దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పాలన దుర్మార్గానికి ఈ ఘటను పరాకాష్టగా చెబుతున్నారు. మనిషి జీవితంలో శ్మశాన ప్రయాణాన్ని ఎంతో గౌరవంగా సాగనంపుతారు. అలాంటి మర్యాదలేవీ లేకుండా బీజేపీ పాలిత రాష్ట్రంలో దళిత కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై … ఛీఛీ …అని అసహ్యించుకుంటున్నారు