పారితోషికం ఎగ్గొట్టిన బిగ్‌బాస్ - ప్ర‌ముఖ న‌టి
పారితోషికం ఎగ్గొట్టిన బిగ్‌బాస్ - ప్ర‌ముఖ న‌టి

ఈ మాటలు విన‌డానికే ఆశ్చ‌ర్యంగా ఉంది.. కానీ ఆ న‌టి మాట‌లు వింటుంటే మాత్రం ఇదెక్క‌డి విడ్డూరం అనిపిస్తోంది. బిగ్‌బాస్‌-3 రియాల్టీ షో ముగిసి ఏడాది పైగా అవుతోంది. మ‌ళ్లీ త‌మిళ బిగ్‌బాస్ సీజ‌న్ కూడా ప్రారంభ‌మ‌వుతోంది. ఇంత వ‌ర‌కూ సీజ‌న్-3 పారితోషికం త‌న‌కు ఇవ్వ‌లేద‌ని కంటెస్టెంట్‌, ప్ర‌ముఖ న‌టి అయిన క‌స్తూరి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

గ‌త ఏడాది బిగ్‌బాస్ సీజ‌న్ 3లో క‌స్తూరి పాల్గొన్నారు. ఒప్పందం ప్ర‌కారం త‌న‌కు పారితోషికాన్ని నిర్వాహ‌కులు చెల్లించ‌లేద‌ని ఆమె ట్వీట్ చేశారు. అస‌లు బిగ్‌బాస్ రియాల్టీ షోలో తానెందుకు పాల్గొనాల‌ని భావించిందో , ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఆమె వివ‌రిస్తూ ట్వీట్ చేశారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ ట్వీట్ వివ‌రాలేంటంటే…

“అనాథ పిల్లలకు ఆర్థికంగా ఆదుకునేందుకే నేను బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొన్నాను. అయితే ఇంత వ‌ర‌కూ షో నిర్వాహకులు నాకు  పారితోషికం చెల్లించలేదు. నేనెప్పుడూ ప్రామిస్‌లను నమ్మను. అయితే `బిగ్‌బాస్‌` నిర్వాహకులు కూడా తప్పుడు ప్రామిస్‌లు చేస్తారని ఊహించ లేకపోయాను” అని కస్తూరి పేర్కొన్నారు.

అస‌లు రాత‌మూల‌కంగా ఒప్పందాలు చేసుకున్న‌ప్పుడు … మ‌ధ్య‌లో ఈ ప్రామిస్‌ల గొడ‌వేంటో? ఒక‌వైపు నేనెప్పుడూ ప్రామిస్‌ల‌ను న‌మ్మ‌న‌ని చెబుతూనే, మ‌రోవైపు బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌ను నిందించ‌డం ఏంటి? క‌స్తూరి ట్వీట్ చూస్తే… ఇంకా ఏదో చెప్పాల్సింది ఏదో ఉంద‌నే భావ‌న క‌లుగుతోంది. ఆమె ఏదో దాస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

మ‌రో మూడు రోజుల్లో అంటే ఈ నెల నాలుగో తేదీ నుంచి తమిళంలో `బిగ్‌బాస్‌-4` ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కస్తూరి ఆరోపణలు సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. బిగ్‌బాస్ నిర్వాహ‌కులు స్పందిస్తే త‌ప్ప అస‌లు వాస్త‌వాలేంటో బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం లేదు. మ‌రి బిగ్‌బాస్ షో నిర్వాహ‌కులు స్పందిస్తారా?  లేదా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here