హత్రాస్ హత్యాచార ఘటన.. పోస్ట్‌మార్టం నివేదికలో భయంకర నిజాలు
హత్రాస్ హత్యాచార ఘటన.. పోస్ట్‌మార్టం నివేదికలో భయంకర నిజాలు

హత్రాస్‌ హత్యాచార బాధితురాలి పోస్టుమార్టం నివేదికను అధికారులు విడుదల చేశారు. బాధితురాలి పట్ల కామాంధులు అత్యంత పాశవికంగా వ్యవహరించినట్టు నివేదిక వెల్లడించింది. అత్యాచారం సమయంలో ఆమె మెడను పదే పదే నులిమివేయడంతో బలమైన గాయాలైనట్టు ముగ్గురు వైద్యుల సంతకం చేసిన రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఈ గాయం ప్రాణం పోయేంత పెద్దది కాదని వైద్యులు తెలిపారు. గొంతు నులిమడంతో వెన్నెముకకు బలమైన గాయమయినట్టు వివరించారు. బాధితురాలి పరిస్థితి కుటుంబానికి వివరించాం.. తగిన చికిత్స అందజేసినప్పటికీ ఆమె పరిస్థితి క్రమంగా క్షీణించింది అని నివేదికలో తెలియజేశారు.

అంతేకాదు, బాధితురాలిని చున్నీతో ఉరివేసే ప్రయత్నం జరిగింది.. కానీ అది ఆమె మరణానికి కారణం కాదని పేర్కొంది. కాగా, హత్రాస్ ఎస్పీ విక్రాంత్ వీర్ మాట్లాడుతూ.. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడలేదని అలీగఢ్ మెడికల్ కాలేజీ వైద్య నివేదిక చెబుతోందని పేర్కొన్నారు.‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మెడికల్ కాలేజీ పోస్ట్‌మార్టం నివేదిక బాధితురాలి ఒంటిపై గాయాలున్నట్టు గుర్తించింది.. కానీ, బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసినట్టు ధ్రువీకరించలేదు.. ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచిచూస్తున్నాం.. ఇప్పటి వరకు బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించలేదు’ అని అన్నారు.

సెప్టెంబరు 14 నుంచి కనిపించకుండా పోయిన బాధిత యువతిపై నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె నాలుక కోసి, వెన్నెముక, మెడపై తీవ్ర గాయాలు చేశారు. సెప్టెంబరు 22న ఊరి బయట అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని గుర్తించి వైద్యం కోసం తరలించారు. తొలుత అలీగఢ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించడంతో ఢిల్లీకి తరలించారు. మంగళవారం సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here