గ్రామాల స్థాయిలోనూ ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్నందున.. దానికి సంబంధించిన నేరగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. ఇంటర్నెట్ లో అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. కాగా, దేశంలో ఈ తరహా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో గతేడాది 1,629 సైబర్ నేరాలు జరిగాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో వెల్లడించింది.

70 శాతానికి పైగా పెరిగిన కేసులు : 

నివేదికలోని వివరాలిలా ఉన్నాయి.. దేశంలో సైబర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మన పొరుగునే ఉన్న కర్నాటక టాప్ ప్లేస్ లో ఉంది. అక్కడ గతేడాది 12,007 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ (9,353), అస్సాం (1,989) ఉన్నాయి. తెలంగాణలో 1,629 కేసులు నమోదయ్యాయి. 2018లో ఈ తరహా కేసులు తెలంగాణలో 585 మాత్రమే నమోదయ్యాయి. ఈ లెక్కన గతేడాదితో పోల్చితే సైబర్ నేరాలు 70 శాతానికి పైగా పెరిగాయి.

రెండోస్థానంలో హైదరాబాద్ :

ఇక నగరాల పరంగా చూసుకున్నా.. హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. 2019లో హైదరాబాద్లో 1,379 ఫిర్యాదులు అందాయి. ఈ జాబితాలోనూ కర్నాటక రాజధాని బెంగళూరు (10,555 కేసులు) మొదటి స్థానంలోనే ఉంది.

నెట్ వినియోగం పెరగడం వల్లే : రాచకొండ  ఎసీపీ
సైబర్ నేరాలు పెరగడంపై రాచకొండ ఎసీపీ ఎస్. హరినాథ్ స్పందిస్తూ.. ప్రపంచం ఆన్లైన్ యుగానికి మారుతున్నందున ఇటువంటి కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు. ప్రజలంతా నిత్యావసర సరుకులు కొనడానికి కూడా ఆన్లైన్ ను విరివిగా వాడుతుండటం.. లావాదేవీలన్నీ నెట్ ద్వారా వాడుతుండటంతో ఇవి పెరిగిపోతున్నాయని చెప్పారు. లాక్డౌన్ సమయంలో కెవైసీ స్కామ్ లు ఎక్కువగా నమోదయ్యాయని ఆయన వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here