Hathras Case: ఆ యువతిపై రేప్ జరగలేదు, గాయం వల్లే మృతి: యూపీ పోలీస్ ప్రకటన
Hathras Case: ఆ యువతిపై రేప్ జరగలేదు, గాయం వల్లే మృతి: యూపీ పోలీస్ ప్రకటన

ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో 20 సంవత్సరాల దళిత యువతి మీద అత్యంత దారుణంగా అత్యాచారం, దాడి చేసిన వారిని శిక్షించాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న వేళ, యూపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) కీలక ప్రకటన చేశారు. అసలు ఆ దళిత యువతి మీద అత్యాచారం జరగలేదని చెప్పారు. ‘యువతి మీద అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టులో వచ్చింది.’ అంటూ ఏడీజీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. ‘పోస్టు మార్టం నివేదిక ప్రకారం బాధితురాలు మెడ మీద గాయం కారణంగా చనిపోయింది. ఆమె శరీరం మీద వీర్యం ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలిపింది.’ అని చెప్పారు. ‘అలాగే, ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా తన మీద అత్యాచారం జరిగినట్టు ఎక్కడా పేర్కొనలేదు. కేవలం కొట్టారని మాత్రమే చెప్పింది.’ అని కుమార్ తెలిపారు. ‘కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, సమాజంలో చిచ్చు పెట్టడానికి కొందరు దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.’ అని ఏడీజీ హెచ్చరించారు. హత్రాస్‌ జిల్లాలో బాధితురాలు చనిపోవడానికి కేవలం మెడ మీద గాయం, దాని వల్ల ఏర్పడిన సమస్యే కారణమని కుమార్ స్పష్టం చేశారు.

ఢిల్లీ సఫ్దార్ గంజ్ ఆస్పత్రిలో 14 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు చనిపోయిన తర్వాత నిర్వహించిన పోస్టుమార్టంలో పేర్కొన్న ప్రకారం, ఆమె మెడకు ఫ్రాక్చర్ అయింది. పీక మీద నొక్కడం వల్ల ఆమె మెడకు ఫ్రాక్చర్ జరిగినట్టు గుర్తించారు. నిందితులు ఆమెను మెడను పదే పదే నొక్కడం వల్ల మెడకు ఫ్రాక్చర్ అయిందని రిపోర్టులో వచ్చింది. దీంతోపాటు మెడ మీద లిగేచర్ మార్క్ ఉన్నట్టు గుర్తించారు. ఆ పోస్టుమార్టం రిపోర్టు మీద ముగ్గురు డాక్టర్లు సంతకాలు చేశారు. పోలీసుల సమక్షంలో వారు ఈ పోస్టుమార్టం నిర్వహించారు. మరోవైపు బాధితురాలి తండ్రి, బంధువు మంగళవారం నాడు ఆస్పత్రి బయట ధర్నా నిర్వహించారు. వారికి భీమ్ ఆర్మీ, కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతు పలికారు. బాధితురాలు చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఉత్తర్ ప్రదేశ్‌కు తరలించారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో 20 సంవత్సరాల దళిత యువతిని సెప్టెంబర్ 14న నలుగురు యువకులు అత్యాచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. తన తల్లితో కలసి పొలం పనులు చేయడానికి వెళ్లిన యువతిపై వారు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. ఆమె నాలుకను కూడా కోసేశారు. రెండు వారాల చికిత్స తర్వాత బాధితురాలు చనిపోయింది. మొదట ఆమెను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దార్ గంజ్ హాస్పటల్‌కు తరలించారు. గత మంగళవారం ఆమె చనిపోయింది. ఆమెకు మంగళవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు బలవంతం చేసి రాత్రి పూట హడావిడిగా తమ కుమార్తెకు దహనసంస్కారాలు చేయించారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆమె మీద దాడి చేసిన నలుగురు నిందితులు అగ్రకులానికి చెందిన వారు. అదే గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం వారి మీద హత్య కేసు కూడా నమోదవుతుంది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే, అర్ధరాత్రి పూట హడావిడిగా అంత్యక్రియలు చేయించేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. పోలీసుల తీరు వల్ల గ్రామస్తుల్లో కోపం, గందరగోళం నెలకొంటోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here