యాపిల్ సంస్థ ఇటీవలే తన ఐఫోన్ యూజర్ల కోసం నూతనంగా ఐఓఎస్ 14.1 అప్డేట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే యాపిల్ సంస్థ ఐఓఎస్ 14.1ను విడుదల చేసిన కొద్ది రోజులకే నూతన ఐఓఎస్ 14.2 పబ్లిక్ బీటా అప్డేట్‌ను కూడా తీసుకొచ్చింది. సాధారణంగా భారత్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారులతో పోలిస్తే ఐఓఎస్ యూజర్లు చాలా తక్కువ. అయినప్పటికీ భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్‌ను కలిగి ఉంది. భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని పలు కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది యాపిల్. దీనిలో భాగంగా ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఎమోజి ఆప్షన్లను, అలాగే మరిన్ని అడ్వాన్సుడ్ ఫీచర్లను జోడించింది. ఈ కొత్త ఐఓఎస్ 14.2 అప్డేట్ లాక్ స్క్రీన్, రీడిసైన్ చేసిన ఎయిర్‌ప్లే 2ను నియంత్రణలోకి తెస్తుంది.

ఐఓఎస్ 14.2 అప్డేట్‌లో కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమయ్యే షాజమ్ టోగుల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఐఓఎస్ 14.2 నూతన అప్డేట్లో 100కు పైగా ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఎమోజి వెర్షన్ 13.0 నుండి ఈ కొత్త ఎమోజీలు చేర్చబడతాయని ఈ ఏడాది ప్రారంభంలోనే యూనికోడ్ కన్సార్షియం ప్రచురించిన విషయం తెలిసిందే. ఎమోజీల కోసం శోధించే వారికి ఈ నూతన అప్డేట్ హైలెట్‌గా నిలువనుంది. ఈ నూతన అప్డేట్ ద్వారా మొత్తం 117 కొత్త ఎమోజీలు జోడించబడతాయి అని 9to5Mac నివేదిక పేర్కొంది.

ఈ నూతన iOS 14.2 పబ్లిక్ బీటాను ఐఫోన్ సెట్టింగ్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానికి గాను మొదట సెట్టింగ్స్లోకి వెళ్లి, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇన్‌స్టాల్ అప్డేట్‌ను ఎంచుకొని నూతన 14.2 అప్డేట్‌ను మీ ఐఫోన్లో ఇన్‌స్టాల్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here