హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దళిత యువతిని నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై విపక్షాలు, ప్రజా సంఘాలు భగ్గమంటున్నాయి. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐతే ఈ కేసులో అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఇప్పటికే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా.. రాత్రివేళ రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాధితురాలి కుటుంబ కుటుంబ సభ్యులను హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ బెదిరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రభుత్వం చెప్పినట్లుగా చేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఒత్తిడి చేస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తమ స్టేట్‌మెంట్‌ను మార్చాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ వీడియోలో కూడా ఇదే ఉంది. ”సగం మంది మీడియా జర్నలిస్టులు ఇవాళ వెళ్లిపోయారు. మిగతా సగం మంది కూడా రేపు వెళ్లిపోతారు. కానీ మీతో ఉండేది మేమే. మీ వాంగూల్మాన్ని మార్చుకుంటారో లేదో మీ ఇష్టం.” అని బాధితురాలి తల్లిదండ్రులతో హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ లక్ష్కర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత సూర్జేవాలా మండిపడ్డారు. సిగ్గుచేటు.. ఇది బెదిరింపు కాదా..? అని ఆయన మండిపడ్డారు.

ఐతే బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించినట్లుగా వస్తున్న ఆరోపణలను హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ ఖండించారు. తాను బుధవారం బాధితురాలి కుటుంబ సభ్యుల్లో ఆరుగురిని కలిశానని.. సుమారు గంటన్నర పాటు మాట్లాడానని ఆయన తెలిపారు. వారి అసంతృప్తి ఏంటో తెలుసుకునేందుకు మరోసారి మాట్లాడానని చెప్పారు. వారిలో భయాన్ని పోగొట్టే ప్రయత్నం మాత్రమే చేశానని వెల్లడించారు ప్రవీణ్ లక్ష్కర్. ఫాస్ట్‌కోర్టులో నిందితుల నేరాన్ని రుజువుచేసి ఉరిశిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, యూపీలోని హత్రాస్‌ జిల్లాలో సెప్టెంబరు 14 20 ఏళ్ల దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. పొలంలో తల్లి, సోదరులతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి నాలుకను కోశారు. మెడను విరిచి గొంతు నులిమారు. అగ్ర కులాలకు చెందిన పలువురు వ్యక్తులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను మొదట అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న బాధితురాలు మరణించింది.

ఐతే బాధితురాలిపై అత్యాచారం జరగలేదని.. తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయిందని యూపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘యువతి మీద అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టులో వచ్చింది.’ అంటూ ఏడీజీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. ‘పోస్టు మార్టం నివేదిక ప్రకారం బాధితురాలు మెడ మీద గాయం కారణంగా చనిపోయింది. ఆమె శరీరం మీద వీర్యం ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలిపింది.’ అని చెప్పారు. ‘అలాగే, ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా తన మీద అత్యాచారం జరిగినట్టు ఎక్కడా పేర్కొనలేదు. కేవలం కొట్టారని మాత్రమే చెప్పింది.’ అని కుమార్ తెలిపారు. ‘కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, సమాజంలో చిచ్చు పెట్టడానికి కొందరు దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.’ అని ఏడీజీ హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ కేసు అలహాబాద్ హైకోర్టు సుమోటోగా తీసుకొని.. రాష్ట్ర ఉన్నతాధికారులకు నోటీసులు పంపింది. అక్టోబరు 12న కోర్టుకు హాజరై హత్రాస్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అడిషనల్ డీజీపీకి జస్టిస్ రంజన్ రాయ్, జస్టిస్ జస్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం సమన్లు జారీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ కూడా కోర్టులో హాజరు కావాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా అర్ధరాత్రి తర్వాత బాధితురాలి అంత్యక్రియలను రహస్యంగా నిర్వహించడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టుకు తమ వాదనలను వినిపించాలని బాధితురాలి తల్లిదండ్రులకు కూడా అవకాశమిచ్చింది. వారు కోర్టుకు వచ్చేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లను చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here