లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే కొందరు వాలంటీర్లు డబ్బుల కోసం చేస్తున్న కక్కుర్తి వ్యవహారాలు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేలా మారాయి. తాజాగా గురువారం ఓ వాలంటీర్ తాను పింఛన్ డబ్బులు పంచడానికి వెళ్తుండగా కొందరు తన కళ్లల్లో కారం చల్లి దాడికి దిగారని కట్టు కథ అల్లాడు. వృద్ధులకు అందించడానికి తీసుకెళ్తున్న రూ. 43, 500 పింఛన్ల డబ్బును లాక్కెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులు దాడిలో తనకు తీవ్ర గాయాలు అయ్యాయంటూ ఆస్పత్రిలోనూ చేరాడు. అయితే ఇదంతా కట్టు కథ అని తేలడంతో అధికారులు అతడిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాల ప్రకారం అనంతపురం జిల్లాకు మడకశిర మున్సిపాలిటీ లోని శివపురం వార్డు సచివాలయంలో ఈరప్ప అనే వాలంటీర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే నిన్న ఒకటవ తారీఖు కావడంతో అధికారులు అతనికి పింఛన్లు పంచమని రూ. 43,500 ఇచ్చారు.

అయితే ఆ డబ్బులను ఎలాగైనా కొట్టేయాలని భావించిన సదరు వాలంటీర్ కు ఓ ఐడియా వచ్చింది. తనపై దుండగులు దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారని డ్రామా ఆడి ఆ పింఛన్ డబ్బులు తానే ఉంచుకోవాలని స్కెచ్ వేశాడు. ప్లాన్ ప్రకారం నిన్న ఉదయాన్నే పింఛన్ డబ్బులు పంచడానికి వెళ్తున్న తనపై కొందరు కారం చల్లి దాడి చేశారని డ్రామా ఆడాడు. తనను తీవ్రంగా కొట్టి పైసలు లాక్కెల్లారంటూ పోలీసులకు ఫిర్యాదు సైతం చేశాడు. అధికారులను నమ్మించేందుకు దుండగుల దాడిలో తనకు తీవ్రంగా గాయాలయ్యాయంటూ ఆస్పత్రిలోనూ చేరాడు. అయితే అతను చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో విచారణ చేపట్టగా వాలంటీర్ కావాలని అసత్యాలు చెప్పినట్లు, కట్టుకథ అల్లినట్లు తేలింది. దీంతో అతడిని విధుల నుంచి తొలగించాలని మడకశిర మున్సిపల్ కమిషనర్ నాగార్జున కు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి సేవలు మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సంతృప్తికరంగా పని చేసిన వారికి మాత్రమే మరో ఏడాది పాటు వారి ఉద్యోగ కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి గ్రామ, వార్డు వాలంటీర్ల పనితీరుకు సంబంధించి సమగ్రమైన నివేదిక తెప్పించుకున్న తర్వాత వారి పదవీకాలాన్ని పొడిగించే అధికారం జాయింట్ కలెక్టర్లకు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో ప్రస్తుతం 2.6 లక్షల మంది పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here