ఆహా ఇది కదా..అభిమానులు కోరుకుంది. చెన్నైని ఇలా కదా చూడాలనుకున్నారు .మూడు వరుస ఓటములతో వచ్చిన విమర్శలతో  ఈసారి గెలుపే లక్ష్యంగా దిగిన చెన్నై పంజాబ్ జట్టుకు చుక్కలు చూపించింది. చెన్నై కదం తొక్కితే ఎలా ఉంటుందో  చూపించింది. ఏకంగా పంజాబ్ పై పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు వాట్సన్ డుప్లెసిస్ వీర విహారం చేశారు. ఒక్క వికెట్ కూడా పడకుండా పంజాబ్ జట్టంతా కలిపి చేసిన స్కోర్ వీరిద్దరే చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 63(7 ఫోర్లు 1 సిక్స్) పరుగులు సాధించాడు.  పూరన్ (17 బంతుల్లో 33; 1 ఫోర్ 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు.  మయాంక్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) మన్దీప్ సింగ్ 16  బంతుల్లో 27 (2 సిక్సర్లు) పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్ కు చెన్నై ఓపెనర్లు  వీర విహారంచేశారు. ఎక్కడా తడబాటు కూడా లేకుండా ఇద్దరే పని పూర్తి  చేశారు. వాట్సన్ 53 బంతుల్లో 83 నాటౌట్ (11 ఫోర్లు 3 సిక్సర్లు) డుప్లెసిస్ 53 బంతుల్లో 87 నాటౌట్ (11 ఫోర్లు 1 సిక్స్) పరుగులు సాధించడంతో సూపర్ కింగ్స్ విజయం సాధించింది. డుప్లెసిస్ తన దైన శైలిలో మరోసారి అదిరి పోయే బ్యాటింగ్ చేశాడు. ఇద్దరి జోరుతో చెన్నై పది వికెట్ల తేడా తో విజయం అందుకుంది.

వాట్సన్ జోరు

మ్యాచ్ లో హై లైట్ అంటే వాట్సన్ బ్యాటింగే.చాలా రోజుల తర్వాత అతడు తన స్థాయి కి తగ్గ ప్రదర్శన చేశాడు. బౌండరీల మోత మోగించాడు.డుప్లెసిస్ సంయమనంతో బ్యాటింగ్ చేస్తుండగా వాట్సన్ ఆట ఆరంభంలో బౌండరీలతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయంటే అతడి దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

రాహుల్ స్పీడుకు ఠాకూర్ కళ్ళెం

పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఓపెనర్ బరిలోకి దిగి ముందంతా వికెట్ కు ప్రాధాన్యం ఇచ్చాడు. చివర్లో పూరన్ తో కలసి చెలరేగాడు. అయితే 18 వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ వీరిద్దరిని వరుస బంతుల్లో ఔట్ చేయడంతో చివరి నాలుగు ఓవర్లలో పంజాబ్  37 రన్స్ మాత్రమే చేయగలిగింది.
వాట్సన్-డుప్లెసిస్ రికార్డు భాగస్వామ్యం

వాట్సన్-డుప్లెసిస్ జోడి తొలి వికెట్‌కు అజేయంగా 181 రన్స్ జోడించారు. ఐపీఎల్లో చెన్నైకి ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. 2013లో పంజాబ్‌ను పది వికెట్ల తేడాతో ఓడించిన ధోనీ సేన మళ్లీ ఇన్నాళ్లకు మళ్ళీ అదే జట్టు పైన రికార్డు నమోదు చేసింది.

ధోనీ మరో రికార్డు
చెన్నై కెప్టెన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వంద క్యాచ్‌లను అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ రికార్డు అందుకున్నాడు.  కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్ ను డైవ్ చేసి పట్టిన  ధోని వంద క్యాచ్ ల ఫీట్ ను సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ కీపర్ క్యాచ్ లు పట్టిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

మ్యాచ్ లో మరిన్ని హైలైట్స్

* ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి చేరుకోగా.. పంజాబ్ అట్టడుగు స్థానానికి పడిపోయింది.

* డుప్లెసిస్ వాట్సన్ కన్నా ఎక్కువ పరుగులు చేసినా వాట్సన్ కే   ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అందుకు కారణం అతడు ఆరంభంలో మెరుపులు మెరిపించడమే కారణం.

* వరుసగా అన్ని మ్యాచ్ లలో రాణిస్తున్న పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఈ మ్యాచ్ లో కూడా చక్కటి అర్ద సెంచరీ చేశాడు.

* డుప్లెసిస్ వాట్సన్ జట్టును గెలిపించినా గేమ్ మలుపు తిప్పింది మాత్రం ఠాకూర్. అతడు జోరు మీద ఉన్న రాహుల్ పూరన్ వరుస బంతుల్లో ఔట్ చేసి పంజాబ్  భారీ స్కోర్  చేయకుండా అడ్డుకట్ట వేశాడు.

* పంజాబ్  తుది జట్టులో కరుణ్ గౌతమ్ నీషమ్‌లను పక్కనబెట్టి మన్దీప్ హర్‌ప్రీత్ బ్రార్ జోర్డాన్‌లను తీసుకోగా చెన్నై మాత్రం ఎటువంటి మార్పులేకుండా గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here