దేశంలో రాజకీయాలు శృతి మించుతున్నాయా?  ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు తిరిగి జాతీయ పార్టీ ఆధిపత్యం పెంచేందుకు వ్యూహాత్మంగా పావులు కదులుతున్నాయా? అంటే.. తాజాగా బిహార్‌లో జరుగుతున్న పరిణామాలను.. ఇప్పటివరకు మరికొన్ని చోట్ల జరిగిన పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. దేశరాజకీయ చరిత్రను గమనిస్తే.. ఇందిరాగాంధీ హయాంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌దే పైచేయిగా మారింది. అంతా తాము చెప్పినట్టే నడుచుకోవాలనే ధోరణి వచ్చింది. అయితే ఆ తర్వాత ఈ దూకుడును తగ్గించే క్రమంలో తమిళనాట ఎంజీఆర్ ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ పార్టీలు పెట్టడం.. తర్వాత ఆయా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడంతో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ హవాకు బ్రేకులు పడి.. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం ప్రారంభించాయి.ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. ఇవి మద్దతిస్తేనే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి పెరిగిపోయి.. యూపీఏ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. ప్రాంతీయ పార్టీల దన్నుతోనే దేశాన్ని ఏలగలిగింది. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతించిన పాత విధానాన్నే అనుసరించాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. అంతే ఒక్కొక్కటిగా ప్రాంతీయ పార్టీలను తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం కుదిరితే.. తన పార్టీలో విలీనం చేసుకోవడం లేదంటే.. వాటి మూలాలను ఛేదించి నిరుత్తురులను చేయడం ద్వారా.. రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏపీలో ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన.. నిన్న మొన్నటి వరకు దూకుడు ప్రదర్శించింది. కానీ ఎప్పుడైతే.. బీజేపీ తన వ్యూహంతో జనసేనను తనవైపు తిప్పుకొందో ఇప్పుడు అస్తిత్వ పోరాటం ప్రారంభమైంది. నిజానికి ఇది భవిష్యత్తులో జనసేన ఉనికికే ప్రమాదం గా మారిపోయింది. ఇక ఇప్పుడు బిహార్ వంతు వచ్చింది. అక్కడ బీజేపీ చాన్నాళ్లుగా చక్రం తిప్పుతోంది. 2015లో జరిగిన ఎన్నికల్లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ కాంగ్రెస్ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలు సంయుక్తంగా సర్కారును ఏర్పాటు చేసుకున్నాయి. కానీ అత్యంత స్వల్పకాలంలోనే బీజేపీ చక్రం తిప్పి.. కాంగ్రెస్ ఆర్జేడీలను బయటకు పంపేసి.. తాను ఆ స్థానాన్ని ఆక్రమించుకుని నితీష్ తో జట్టుకట్టింది.

ఇక ఇప్పుడు నితీష్ ను కూడా ఉనికి లేకుండా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తాజాగా జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే తో అంటకాగుతున్న రాం విలాస్ పాశవాన్ పార్టీ ఎల్జేపీని తన కనుసన్నల్లో బీజేపీ నడిపిస్తోంది. నిజానికి ఇది నితీష్‌కు అత్యంత మిత్రపార్టీ. అయితే లోలోన కుంపట్లు పెట్టిన బీజేపీ.. నితీష్‌పై ఎల్జేపీ అధ్యక్షుడు పాశవాన్కుమారుడు చిరాగ్‌ను ఉసికొల్పింది. కొన్నాళ్లుగా ఆయన సీఎం సీటు పై కన్నేసి.. నితీష్ కేంద్రంగా దూకుడు ప్రారంభించారు. నితీష్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరింత మంట ను రాజేసింది బీజేపీ.

ఈ క్రమంలో ఎల్జేపీ పూర్తిగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు నితీష్-బీజేపీ ల కూటమి మాత్రమే పోటీ చేస్తుండగా.. ఎల్జేపీ సొంతగా పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థలు పోటీ చేసే చోట తాము పోటీ చేయబోమని నితీష్ ఓటమే లక్ష్యంగా జేడీయూ అభ్యర్థులపై మాత్రం పోటీ పెడతానని ప్రకటించారు. అంతేకాదు ఎన్నికల అనంతరం.. ఎల్జేపీ-బీజేపీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన ప్రకటించారు. కానీ వాస్తవానికి ఈ వ్యూహం అంతా బీజేపీదేనని ముక్కుపచ్చలారని చిరాగ్‌కు ఇంత ధైర్యం లేదని ఇది ప్రాంతీయ పార్టీల మధ్య ముళ్లు వేసి.. అంతిమంతా తాను లబ్ధి పొందేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమేనని అంటున్నారు పరిశీలకులు. రేపు చిరాగ్ చెప్పినట్టే ఎల్ జేపీ-బీజేపీ ప్రభుత్వం వచ్చినా.. చిరాగ్ ఆశించిన విధంగా మాత్రం జరగబోదని బీజేపీనే కింగ్ మేకర్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి బీజేపీ వ్యూహం ఇప్పటికైతే ఫలించింది. ఇది ప్రాంతీయ పార్టీలకు తీరని విఘాతమేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here