ఢిల్లీలో ఏం జరుగుతోంది ? ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ తరువాత ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయా ? జాతీయస్థాయిలో వివిధ అంశాలవారీగా బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలుపుతూ వస్తున్న వైసీపీ త్వరలోనే ఎన్డీయేలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన రెండు వారాల వ్యవధిలోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కావడం వెనుక అసలు కారణం ఇదేననే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో జరుగుతోంది. దాదాపు 40 నిమిషాలపాటు సాగిన ప్రధాని మోదీ, సీఎం జగన్ భేటీలో ఏపీకి సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయని.. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపైనే సీఎం జగన్ ప్రధానితో చర్చించారని వైసీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. భేటీలో చర్చకు వచ్చిన అసలు అంశాలు మాత్రం వేరే ఉన్నాయనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.
ఎన్డీయేలోకి కొత్త మిత్రులను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్న బీజేపీ.. వైసీపీని ఎన్డీయేలో చేరాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో శివసేన, ఇటీవల వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అకాళీదల్.. ఎన్డీయేకు దూరమయ్యాయి. దీంతో తమ కూటమిలోకి కొత్త మిత్రులను తీసుకురావాలని బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమతో స్నేహంగా ఉంటున్న వైసీపీని ఎన్డీయేలోకి తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఈ దిశగా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎన్డీయేలో చేరితే రెండు కేంద్రమంత్రి పదవులతో పాటు ఒక సహాయమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమని బీజేపీ జాతీయ నాయకత్వం ఆఫర్ చేసినట్టు సమాచారం.

సీఎం జగన్, ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
తేల్చుకోలేకపోతున్న వైసీపీ ?
అయితే వైసీపీ మాత్రం ఎన్డీయేకు మద్దతు ఇచ్చే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రాష్ట్రంలోని తమ ప్రత్యర్థి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ బహిరంగంగానే కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా కేంద్ర స్థాయిలో సహకారం అందించాలని వైసీపీ కేంద్రాన్ని కోరుతోంది. ఈ క్రమంలోనే ఎన్డీయేలో చేరితే వైసీపీ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారనే ఊహాగానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్డీయేలో చేరడం మినహా అన్ని అంశాల్లో కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలోని తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు ప్రత్యేక హోదా సహా వివిధ అంశాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంలో చేరితే విపక్షాలకు టార్గెట్ అవుతామనే భావనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ సమావేశం తరువాత ఏపీ, జాతీయ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయా ? అన్నది ఆసక్తికరంగా మారింది.