చంద్రబాబుతో సబ్బం హరి ఢీ అంటే ఢీ
చంద్రబాబుతో సబ్బం హరి ఢీ అంటే ఢీ

విశాఖ మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరి ఒక్కసారిగా ఫ్రంట్  పేజీ వార్తల్లోకి వచ్చారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా సబ్బం హరిని భుజాన మోస్తోంది. అసలు ఎవరు ఈ సబ్బం హరి. ఏమిటి ఇతగాడి ధైర్యం? ఏమిటి ఈయన ప్రస్థానం?

సబ్బం హరి ఉత్తరాంధ్రలో మాత్రమే వుండే కొప్పల వెలమ కులానికి చెందిన నాయకుడు. విశాఖ సమీపంలోని తగరపు వలస ఈయన స్వస్థలం. అక్కడ నుంచి ప్రేమ వివాహం చేసుకుని విశాఖకు తరలివచ్చారు. విశాఖలోని కంచరపాలెం మెట్టు అనే ప్రాంతంలో బియ్యం వ్యాపారంతో ఆయన తన ప్రస్థానం ప్రారంభించారు.

చురుగ్గా ఆలోచించడం, లాజికల్ గా మాట్లాడడం, ఎవరినైనా గద్దించి కూర్చోపెట్టగల ఆటిట్యూడ్ అన్నీ కలిసి సబ్బం హరిని యూత్ కాంగ్రస్ నాయకుడిగా మార్చాయి.  అప్పట్లో ఉత్తరాంధ్ర కాంగ్రెస్ లీడర్ గా వున్న ద్రోణంరాజుతో కాస్త అంటీ ముట్టనట్లుగానే వుండేవాడు.

ఇలాంటి టైమ్ లో 1990 తరువాత తొలిసారి ఉత్తరాంధ్ర సమస్యలు, అలాగే వెలమల సమస్యల మీద సబ్బం హరి పాదయాత్ర చేసాడు.అప్పుడు అతని పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో రాజకీయంగా బలపడ్డారు. 1995లో విశాఖ  మేయర్ గా పోటీ చేసి గెలిచారు.

ఒకపక్క రాజకీయాల్లో వుంటూనే కంచరపాలెం ప్రాంతంలో ఓ అడ్డా నిర్వహించేవారు. ఇక్కడ జనాల తగువులు తీర్చే కార్యక్రమం తరచు జరిగేది. ఆస్తి గొడవలు, కుటుంబ తగాయిదాలు ఇలా ఒకటేమిటి రకరకాల వ్యవహారాలు అక్కడ పరిష్కారమయ్యేవి.

ఒక విధంగా ప్రయివేటు కోర్టు టైపు అన్నమాట. ఇవన్నీ కలిసి మేయర్ గా మార్చిన తరువాత కూడా ఈ ప్రయివేటు కోర్టును చిరకాలం నిర్వహిస్తూనే రావడం అన్నది సబ్ఛం హరి తెలివితేటలకు నిదర్శనం. ఆ విధంగా తన పట్టు నిలబెట్టుకునేవాడు.

సబ్బం హరి దగ్గర వున్న అతి పెద్ద లక్షణం. మొండితనం. ఎవర్నయినా ఢీకొనడమే. తొలి రోజుల్లో ద్రోణం రాజుతో పడేది కాదు. మేయర్ గా వున్నపుడు అప్పటి సిఎమ్ చంద్రబాబు తో ఢీ అంటే ఢీ అనేవారు. నిత్యం తెలుగుదేశం పార్టీ నాయకులతో, ప్రభుత్వంతో వివాదాలే నడిచేవి.

అలాంటి టైమ్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వచ్చినపుడు, ఆయన ఛాంబర్ లో రౌడీ షీటర్లను రాత్రికి రాత్రి దాచేసి, తెల్లవారి అభ్యర్ధులను బెదిరించే కార్యక్రమం జరిగింది. అప్పటి పోలీస్ కమిషనర్ స్వయంగా మేయర్ చాంబర్ తలుపులు బద్దలు కొట్టారు. అప్పట్లో ఇది కేసు అయింది కొన్నాళ్లు అలాగే నడిచింది.

విశాఖలో తెలుగుదేశం పార్టీతో నిత్యం ఢీ అంటే ఢీ అనేవారు. చంద్రబాబును దారుణంగా విమర్శించేవారు. కంచర పాలెం ఫ్లయ్ ఓవర్ ను చంద్రబాబు చేత ఓపెన్ చేయిద్దాం అనుకుంటే ఈయనే ఒక రోజు తన కారుతో ప్రయ్ ఓవర్ మీద డ్రయివ్ చేసి, ఓపెనింగ్ అయిపోయింది అనిపించేసారు.

ఇలా ప్రతి సారీ చంద్రబాబును ఇరుకున పెట్టడానికి, ఢీ అంటే ఢీ అనడానికే సబ్బం హరి ముందుకు దూకేవారు. అప్పట్లో కమిషనర్ గా వుండే శ్రీలక్ష్మి తో కూడా ఆయనకు అస్సలు సరిపడేది కాదు. పైగా చంద్రబాబుతో అంతగా సరిపడని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తో సబ్బం హరి సాన్నిహిత్యంతో వుండేవారు. నందమూరి హరికృష్ణ ఎప్పుడు వచ్చినా సబ్బం హరికి అతిధిగా వుండేవారు.

వివాదస్థలాలు మిత్రుల చేత కొనిపించి, సెటిల్ మెంట్ లు చేసి, ఆ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం అన్నది సబ్బం హరి బిజినెస్ గా విశాఖ వాసులు చెప్పుకుంటారు. నిజానికి సబ్బం హరి ఆదాయ మార్గం ఇదీ అన్న క్లారిటీ డైరక్ట్ గా ఒక్కటీ లేదు.

తొలిసారి ఎమ్మెల్యేగా విశాఖలోని నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత కేవిపి చలువతో, రికమెండేషన్ తో వైఎస్ రాజశేఖర రెడ్డి అనకాపల్లి ఎంపీ టికెట్ ను కేటాయించాల్సి వచ్చింది. అల్లు అరవింద్, నూకారపు సూర్యప్రకాశరావు లాంటి నాన్ లోకల్స్ పోటీ చేయడం, వైఎస్ వేవ్ వుండడంతో సబ్బం గెలిచారు.

ఆ తరువాత వైఎస్ జగన్ కు దగ్గరయ్యారు. ఎంపీ పదవికి రాజీనామా చేయమంటే చేయనని ససేమిరా అనడం, ఓదార్పు యాత్రలో ఫండ్స్ మిస్ యూజ్ చేసారనే గుసగుసలు వినిపించడం, అలా మొత్తం మీద జగన్ కు దూరం అయ్యారు.

ఆ తరువాత తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో, కొన్నాళ్లు క్రియాశీలక రాజకీయాలకు దూరంగావున్నారు. తరువాత కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరై, ఆ పార్టీ మీద పోటీ చేయాలనుకున్నారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

ఇప్పుడు సబ్బం హరి దృష్టి అంతా విశాఖ మేయర్ సీటు మీద. రాబోయే లోకల్ ఎన్నికల్లో మేయర్ గా పోటీ చేసి మరోసారి విశాఖ లో జెండా ఎగరేయాలన్నది ఆయన సంకల్పం. కానీ అంత అంత వీజీ కాదు. ఎందుకంటే ఆ సీటు మీద చాలా కళ్లు వున్నాయి. ముఖ్యంగా సామాజిక సమీకరణలు వున్నాయి. అన్నింటికి మించి గతంలో తెలుగుదేశంతో ఢీ అంటే ఢీ అనడం, ఇప్పుడు వైకాపాతో ఢీ అంటే ఢీ అనడం, ఇలా ప్రతి చోటా సున్నం పెట్టుకునే ఆటిట్యూడ్ ను రాజకీయ పార్టీలు సహించడం కష్టం కావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here