అరుదైన జాబితాలో కాజల్
అరుదైన జాబితాలో కాజల్

హీరోయిన్లకు ఓ మోస్తరుగా అవకాశాలు వస్తున్నంత వరకు పెళ్లి గురించి పెద్దగా ఆలోచించరు. చరిత్ర చూస్తే చాలామంది హీరోయిన్లు తమ హవా తగ్గిపోయాక.. అవకాశాలు ఆగిపోతున్న దశలోనే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఒకప్పుడు సౌత్ సినిమాను ఏలిన సౌందర్య సిమ్రాన్ జ్యోతిక లాంటి వాళ్లందరూ కూడా కెరీర్ బాగా స్లో అయ్యాకే పెళ్లి చేసుకున్నారు. త్రిష గతంలో పెళ్లి చేసుకోబోయి ఆగిపోయింది కానీ.. అప్పటికే ఆమె డిమాండ్ పడిపోయింది. నయనతార మంచి ఫాంలో ఉండగానే ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది కానీ.. ఆ వ్యవహారానికి అనుకోకుండా తెరపడింది. తర్వాత ఆమె మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టి ఇంకా పెద్ద రేంజికి వెళ్లింది. విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమైనా సరే.. మంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో పెళ్లి వైపు మాత్రం అడుగులేయట్లేదు.
కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఇంకా కథానాయికగా మాంచి ఊపుమీద ఉండగానే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఓవైపు తెలుగులో ఆచార్య లాంటి పెద్ద సినిమా… మరోవైపు తమిళంలో ఇండియన్-2 లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఆమె కథానాయిక. బహుశా ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక పెళ్లి చేసుకుందామని ఆమె అనుకుందో ఏమో కరోనా అడ్డం పడి ఆ సినిమాలను వాయిదా వేసింది. ఎలాగైతేనేం ఈ నెల 30న కాజల్ పెళ్లి చేసుకోబోతోంది. ఆ తర్వాత ఆచార్య ఇండియన్-2 సినిమాల్లో నటించబోతోంది. పెళ్లి తర్వాత ఇంత క్రేజీ ప్రాజెక్టుల్లో కథానాయికగా నటించి.. మంచి డిమాండ్లో ఉండగానే పెళ్లి చేసుకున్న అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్లలో ఒకరు కాబోతోంది కాజల్. ఇంతకుముందు సమంత సైతం ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుంది కానీ.. పెళ్లి తర్వాత ఆమె పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలకు పరిమితమైంది. మరి కాజల్ కెరీర్ను ముందుకు ఎలా తీసుకెళ్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here