టాలీవుడ్ శ్రీమంతుడు.. రూ.500 కోట్ల భూమి దానం చేసిన తెలుగు విలన్
టాలీవుడ్ శ్రీమంతుడు.. రూ.500 కోట్ల భూమి దానం చేసిన తెలుగు విలన్

ఆయన సినిమాల్లో విలన్‌ వేషాలు వేసినప్పటికీ నిజ జీవితంలో మాత్రం హీరోలకే హీరో లాంటోడు. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి. పూర్తి పేరు మందాడి ప్రభాకర్ రెడ్డి. హీరోలు ఒకరిద్దరిని ఆదుకుంటేనే మా వాడు గొప్పోడు అంటూ అభిమానులు ప్రచారం చేసుకునే కాలమిది. కానీ అభిమాన సంఘాలు, భజన సంఘాలు లేని సమయంలో తనకంటే ఎక్కువ సంపాదించే హీరోలను మించి గొప్ప సాయం చేశారాయన. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో హీరోలు స్టుడియోలు, సినిమా హాళ్లు కట్టుకోవడంలో బిజీ అయిపోయారు. అప్పడు ప్రభాకర్‌రెడ్డి తన భూమిని సినీ కార్మికులు ఇళ్లు కట్టుకునేందుకు దానం చేశారు. ఇప్పుడు ఆ స్థలంలోనే చిత్రపురి కాలనీ ఏర్పడింది.

సినిమాలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు కల్పించాలన్న ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్షరాలా 500 కోట్ల రూపాయలు. ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా సొంతిళ్లలో ఉంటున్నారు. అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి వెయ్యి రెట్లు గొప్పవారు. ఆయన సినిమాల్లో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం హీరో.

ప్రభాకర్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి. ఎంబీబీఎస్ చదివిన ఆయన డాక్టర్ కావాల్సి యాక్టరయ్యారు. 1961లో ‘చివరకు మిగిలేది’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆయన సుమారు 400కి పైగా సినిమాల్లో నటించారు. ఎక్కువ సినిమాల్లో విలన్‌గా నటించడంతో నిజజీవితంలోనూ ఆయన్ని అలాగే చూసేవారు. జయప్రద మూవీస్ పేరుతో కొన్ని సినిమాలు నిర్మించిన ఆయన.. కొన్ని కథలు కూడా సమకూర్చారు.

ఈ క్రమంలో ఆనాటి హీరోలకు ధీటుగా డబ్బులు సంపాదించారు. చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలా మంది హైదరాబాద్‌లో స్థలాలు కొనుగోలు చేశారు. ప్రభాకర్ రెడ్డి కూడా వారితో పాటు గచ్చిబౌలి సమీపంలో పదెకరాల స్థలం కొన్నారు. అయితే, ఆనాటి హీరోలంతా హైదరాబాద్‌లోని తమ స్థలాల్లో విలాసవంతమైన ఇళ్లు, సినిమా హాళ్లు, సినీ స్టూడియోలు నిర్మించుకోగా… ప్రభాకర్ రెడ్డి మాత్రం తన స్థలాన్ని సినిమాలే జీవితంగా బతుకుతున్న సినీ కార్మికులకు దానంగా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here