టిక్‌టాక్ ప్రేమ చివరికి మోసపోయానంటూ అమ్మాయి లబోదిబోమంటోంది. అయితే ఆ అమ్మాయికి ఇలాంటివి కొత్తేమి కాదని, గతంలో ఆ అమ్మాయికి సంబంధించిన ఉదంతాలను పోలీసులు ఉదహరిస్తున్నారు. దీంతో బాధితురాలి టిక్‌టాక్ ప్రేమ వ్యవహారం చిత్తూరు జిల్లాలో టాక్ ఆఫ్ ది డిస్ట్రిక్‌గా మారింది. యువతి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన మంజులకు టిక్‌టాక్‌లో కడప జిల్లా మైదుకూరు యువకుడైన ఫొటోగ్రాఫర్ కమ్మరి బ్రహ్మయ్య (23) పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. కరోనాలో పనుల్లేక బ్రహ్మయ్య ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రేమికురాలు రూ.20 వేలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో బ్రహ్మయ్య వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అప్పుడు బ్రహ్మయ్య నిజ స్వరూపం ఏంటో బయట పడింది. తన ఇంట్లో ఒప్పుకోలేదని చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో మంజులకు ప్రేమ మత్తు దిగింది. తనకు న్యాయం చేయాలంటే పీలేరు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది.
సదరు ప్రేమికుడి వయస్సు ఆధార్‌కార్డులో 17 ఏళ్లు అని, వాళ్ల తల్లిదండ్రులు కేసు పెడితే మంజులకే ఇబ్బందులు తప్పవని ఎస్ఐ చెప్పారు. ఈ విషయాన్ని మంజుల మీడియా దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి బ్రహ్మయ్య తనకంటే రెండేళ్లు పెద్దవాడని, పాస్‌పోర్ట్‌లో అతని కచ్చితమైన వయస్సు నమోదైనట్లు ఆమె చెప్పింది. ఎలాగైనా తనకు ప్రియుడితో పెళ్లి జరిపించాలని మంజుల గట్టిగా డిమాండ్ చేస్తోంది.
మంజుల ప్రేమ వ్యవహారంపై పీలేరు డీఎస్పీ రవిమనోహరాచారి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. మంజులకు ఇలాంటి ప్రేమ వ్యవహారాలు కొత్తేమీ కాదన్నాడు. గత ఏడాది కూడా ఇలాంటి ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించిందన్నాడు. 2019 ఆగస్టు 15న రాజ్‌కుమార్ అనే యువకుడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్టు చెప్పుకొచ్చాడు.
మళ్లీ అదే తరహాలో ఫిర్యాదుతో ముందుకొచ్చిందన్నాడు. అయితే బ్రహ్మయ్య తనను మోసం చేసినట్లు ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ చెప్పాడు. కానీ వాళ్లిద్దరికీ పెళ్లి జరపడం తమ పరిధిలోని అంశం కాదని డీఎస్పీ స్పష్టం చేశాడు. ఈ పరిస్థితిలో మంజుల తన ప్రియుడిపై కేసు పెట్టి జైలుకు పంపుతుందా లేక అతన్ని పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.