కేసీఆర్‌తో గొడ‌వ -బాబు, జ‌గ‌న్‌కు తేడా
కేసీఆర్‌తో గొడ‌వ -బాబు, జ‌గ‌న్‌కు తేడా

తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య జ‌ల వివాదం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. దీంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య ముఖ్య‌మంత్రుల మ‌ధ్య విభే దాలు చోటు చేసుకున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్ ప‌ర‌స్ప‌రం వాగ్వాదానికి దిగ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఏపీ గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో కూడా కేసీఆర్‌కు తీవ్ర‌స్థాయిలో విభేదాలున్న విష‌యం తెలిసిందే.

ఏపీలో అధికార మార్పిడి త‌ర్వాత జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య స‌త్సంబంధాలు కొన‌సాగాయి. ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రై ఆశీస్సులు అందించారు. ఆ త‌ర్వాత కూడా ముఖ్య‌మంత్రులిద్ద‌రూ హైద‌రాబాద్‌లో స‌మావేశ‌మై రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న అప‌రిష్కృత స‌మ‌స్య‌లపై దృష్టి సారించారు. స‌మ‌స్య‌లను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకునేందుకు చ‌ర్చించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థకం చేప‌ట్ట‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో అక్ర‌మ ప్రాజెక్టుల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఒక ర‌క‌మైన ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకొంది.

అయితే గ‌తంలో చంద్ర‌బాబు -కేసీఆర్ మ‌ధ్య‌, ఇప్పుడు కేసీఆర్ -జ‌గ‌న్ మ‌ధ్య విభేదాలు లేదా ఘ‌ర్ష‌ణ‌కు చాలా తేడా ఉంది. కేసీఆర్ -చంద్ర‌బాబు మ‌ధ్య గొడ‌వ వ్య‌క్తిగ‌త‌మైంది. కానీ కేసీఆర్ -జ‌గ‌న్ మ‌ధ్య గొడ‌వ రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య హ‌క్కుల‌కు సంబంధించింది.

త‌న ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌ర‌చ‌డానికి ఎమ్మెల్యేల కొనుగోళ్ల‌కు చంద్ర‌బాబు పాల్ప‌డుతున్నార‌ని, ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటుకు నోటు కేసులో నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికాడ‌ని  కేసీఆర్ ఆరోప‌ణ‌, ఆగ్ర‌హానికి కార‌ణం. అంతేకాదు స‌ద‌రు ఎమ్మెల్యేకు రూ.50 ల‌క్ష‌లు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా రేవంత్‌రెడ్డి ప‌ట్టుబ‌డ‌డంతో పాటు చంద్ర‌బాబు బ్రీప్‌డ్ మి అంటూ ఆడియో చిక్క‌డం తెలిసిందే.

దీంతో ప‌దేళ్ల పాటు హైద‌రాబాద్‌పై ఉన్న హ‌క్కును కాల‌ద‌న్నుకుని చంద్ర‌బాబు రాత్రికి రాత్రే అన్నీ స‌ర్దుకుని విజ‌య‌వాడ‌కు త‌ర‌లి వ‌చ్చిన వైనం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇదే జ‌గ‌న్ విష‌యానికి వ‌ద్దాం. కేవ‌లం నీటి పంప‌కాల్లో హ‌క్కుల‌కు సంబంధించి మాత్ర‌మే కేసీఆర్‌తో జ‌గ‌న్‌కు విభేదాలు. అంతే త‌ప్ప ఇద్ద‌రి మ‌ధ్య గ‌తంలో మాదిరిగా ప్ర‌భుత్వాల కూల్చివేత వ్య‌వ‌హారాలు వాళ్లిద్ద‌రి గొడ‌వ‌కు కార‌ణం కాలేదు.

కేవ‌లం ప్ర‌భు త్వాల అధినేత‌లుగా , త‌మ‌త‌మ రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల కోసం అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ – జ‌గ‌న్ ప‌రస్ప‌రం వాగ్వాదానికి దిగ‌డాన్ని చూడొచ్చు. వ్య‌క్తిగ‌త స్నేహాలు, ఇష్టాయిష్టాల‌ను ప‌క్క‌న పెట్టి, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఆ మాత్రం ఘ‌ర్ష‌ణ ప‌డ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మే.

గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాల కూల్చివేత కుట్ర‌లో భాగ‌స్వామిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజాన్ని త‌ల‌దించుకునేలా చేశారు. కానీ అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్‌తో గ‌ట్టిగా వాదించి జ‌గ‌న్ ఏపీని త‌లెత్తుకునేలా చేశారు. ఇదే జ‌గ‌న్‌, చంద్ర‌బాబు మ‌ధ్య ఉన్న తేడా. ఓటుకు నోటు కేసులో బాబు చ‌ట్ట‌ప‌రంగా త‌ప్పించుకుంటున్న‌ప్ప‌టికీ, ప్ర‌జాకోర్టులో త‌గిన శిక్ష‌కు గుర‌య్యాడు.

ఏది ఏమైనా ముఖ్య‌మంత్రులు, వాళ్ల స్నేహాలు ఏవీ శాశ్వ‌తం కావు. ప్ర‌భుత్వాలు, పాల‌సీలు మాత్ర‌మే శాశ్వ‌తంగా ఉంటాయి. ఆ స్పృహ , విజ్ఞ‌త ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఉండ‌డం వ‌ల్లే త‌మ త‌మ రాష్ట్ర జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం బిగ్ ఫైట్‌కు త‌ల‌ప‌డ్డా ర‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే కేసీఆర్ లేదా జ‌గ‌న్ వాద‌న‌ల్లో వ్య‌క్తులుగా కాకుండా ప్ర‌భుత్వాలుగా మాత్ర‌మే మాట్లాడ‌డాన్ని గ‌మ‌నించ వ‌చ్చు.

అందుకే కేసీఆర్‌తో గొడ‌వ ప‌డ‌డంలో చంద్ర‌బాబు, జ‌గ‌న్ మ‌ధ్య ఆ తేడాను ప్ర‌జానీకం ఇప్ప‌టికే ప‌సిగ‌ట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here