ప్రియురాలు బయటికొచ్చినందుకు ప్రియుడికి రూ.60 వేలు ఫైన్.. షాకింగ్
ప్రియురాలు బయటికొచ్చినందుకు ప్రియుడికి రూ.60 వేలు ఫైన్.. షాకింగ్

ప్రియుడిని కలిసేందుకు బయటికొచ్చినందుకు యువతిని దారుణంగా కొట్టి.. పెద్దమనుషుల పంచాయతీ పెట్టి ఫైన్ వేసిన అమానుష ఘటన ఒడిశాలో ఆలస్యంగా వెలుగుచూసింది. రెండునెలల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశమైంది. ప్రియుడిని కలిసేందుకు వెళ్తున్న యువతిని కొందరు యువకులు చితకబాదుతున్న వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ ఘటన నవరంగ్‌పూర్ జిల్లాలోని రాయ్‌గఢ్ పరిధిలో జరిగింది.

గ్రామానికి చెందిన యువతి, సమీపంలోని పూజారిపరకి చెందిన జగదీష్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. గత జూలై నెలలో యువతి ప్రియుడిని కలిసేందుకు వెళ్తున్న విషయం ఆమెకు సోదరుడి వరసయ్యే శిశుపాల్‌కి తెలిసింది. తన స్నేహితులతో కలసి చెల్లెలిని వెంబడించిన శిశుపాల్.. ఆమెను చితకబాదాడు. స్నేహితులతో కలసి కర్రలతో తీవ్రంగా కొట్టారు. తప్పించుకునేందుకు ఆమె పరిగెడుతున్నా వెంటాడి అమానుషంగా దాడి చేశారు.

అంతటితో ఆగకుండా రచ్చబండ వద్ద పెద్ద మనుషుల పంచాయితీ పెట్టారు. అక్కడికి ఆమె ప్రియుడు జగదీష్‌ని కూడా పిలిపించిన గ్రామ పెద్దలు ఇద్దరివీ వేర్వేరు కులాలని.. నష్టపరిహారం కింద రూ.60 వేలు కట్టాలని ఆదేశించారు. భయపడిపోయిన యువకుడి కుటుంబం అందుకు అంగీకరించింది. అప్పటికప్పుడు తమ వద్ద ఉన్న రూ.20 వేలు చెల్లించి మిగిలిన సొమ్ము తర్వాత చెల్లిస్తానని చెప్పి జగదీష్ కుటుంబం వెళ్లిపోయింది. అనంతరం జగదీష్ పనుల కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోయాడు.

అయితే యువతిని కొడుతున్న సమయంలో యువకులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన వ్యక్తిని కలిసేందుకు వెళ్తున్న యువతిని చావబాదుతున్న వీడియో తీవ్రంగా కలచివేసింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శిశుపాల్ సహా అతని స్నేహితులు దినేష్, నరసింగను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here