బాహుబలి.. కేజీఎఫ్ లా ట్రై చేద్దామనుకుంటున్నాడు కానీ..!
బాహుబలి.. కేజీఎఫ్ లా ట్రై చేద్దామనుకుంటున్నాడు కానీ..!

కన్నడ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు ఉపేంద్ర. తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితం. ఇక్కడా చెప్పుకోదగ్గ చిత్రాల్లో క్యారెక్టర్లు చేసిన ఉపేంద్ర ప్రస్తుత సన్నివేశమేంటి? అంటే .. ఆయన క్రేజు ఇప్పుడు అంతంత మాత్రమే. ఆరంభం హీరోగా వెరైటీ చిత్రాలతో అలరించాడు. వెరైటీ గెటప్పులు.. అగ్గి రాజేసే కాన్సెప్టులతో చెలరేగి బాగానే ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఉపేంద్ర నటించిన సూపర్ లాంటి సినిమాల గురించి ఇప్పటికీ కన్నడిగులు ముచ్చటించుకుంటారు. ఇక తెలుగులో శ్రీకాంత్ లాంటి హీరోతో  కలిసి పలు చిత్రాల్లో నటించాడు. ఇటీవల బన్ని నటించిన `సన్ అఫ్ సత్యమూర్తి`లో కూడా అదిరిపోయే పాత్రలో నటించాడు.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఇటీవల అతడి క్రేజు ఎందుకనో మటుమాయమైంది. కిచ్చా సుదీప్ సహా పలువురు యంగ్ స్టార్లు కన్నడ రంగంలోకి సర్రున దూసుకొచ్చి సక్సెస్ సాధించారు. దీంతో సీనియర్లకు రేంజ్ తగ్గిందనే చెప్పాలి. ఇక ఉప్పీ బ్రాండ్ కి ఇమేజ్ పడిపోవడంతో ఇతరులు ఇరుగు పొరుగు భాషల్లోనూ ఇమేజ్ పెంచేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకా ఉపేంద్రను చూస్తారా? ఇన్ని ఫ్లాపులొచ్చాక.. స్టార్ డమ్ పడిపోయాక కూడా? అసలు పనవ్వుద్దా? అంటూ చర్చ సాగుతున్న వేళ అతడు మరోసారి కంబ్యాక్ కోసం చేస్తున్న ప్రయత్నం ఆసక్తిని పెంచుతోంది.

ఉపేంద్ర ప్రస్తుతం బహుభాషా చిత్రం కబ్జాలో నటిస్తున్నారు. ఇదో పీరియడ్ డ్రామా. ఇందులో ఉపేంద్ర అండర్ వరల్డ్ డాన్ గా నటిస్తున్నారు.  ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా రెండు భాగాలుగా ఉంటుందని దర్శకుడు ఆర్.చంద్రు తెలిపారు. ఇక ఈ చిత్రానికి బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్ శిష్య బృందం రచయితలుగా పని చేస్తున్నారు. ఆయన శిష్యుల్లో కొందరు రచయితలు బెంగళూరులో స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట.

నిజానికి ఈ మూవీని ఒకే భాగంగా తీయాలని కరోనా ముందు మొదలెట్టారు. కానీ ఇప్పుడు కబ్జాను రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే రెండు భాగాల షూటింగ్ సంగతి అలా ఉంచితే.. మొదట పార్ట్ వన్ షూటింగ్ చేయనున్నట్లు చంద్రు స్పష్టం చేశారు.  గత సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభించేందుకు మినర్వా మిల్స్ లో భారీ జైలు సెట్ నిర్మించారట. ఒక ప్రధాన యాక్షన్ బ్లాక్ తో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకున్నా.. స్క్రిప్ట్ ను మెరుగులద్దేందుకు నవంబర్ కు వాయిదా వేసినట్లు చంద్రు చెప్పారు.  కబ్జా ఏడు భాషలలో విడుదలయ్యే పాన్-ఇండియన్ చిత్రం. ఇది కన్నడ- తమిళం -తెలుగు భాషలలో తెరకెక్కిస్తారు. మలయాళం- హిందీ- మరాఠీ – బెంగాలీ భాషలలో డబ్ చేసి విడుదల చేస్తారు. ఐ లవ్ యు తర్వాత చంద్రు- ఉపేంద్ర జోడీ రెండో ప్రయత్నమిది. శ్రీ సిద్దేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో MTB నాగరాజ్ నిర్మిస్తున్నారు. ఉప్పీ ప్రయత్నం చూస్తుంటే బాహుబలి .. కేజీఎఫ్ తరహాలో రెండు భాగాల పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడని అర్థమవుతోంది. అయితే లేట్ ఏజ్ లో ఈ ప్రయత్నం ఎంతవరకూ సఫలమవుతుంది? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here