టీటీడీ 26వ ఈవోగా జవహర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. టీటీడీ ఈవోగా జహవర్‌రెడ్డి బదిలీ అయినప్పటి నుంచి కులం పేరుతో కొందరు రచ్చ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, అదనపు జేఈవో ధర్మారెడ్డి ఇప్పటికే తిరుమలలో ఉన్నా రని, ఇప్పుడు జవహర్‌రెడ్డి రాకతో వారికి మరో రెడ్డి తోడయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి సీపీఎం అనుబంధ కార్మిక సంస్థ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి నాయకత్వం వహిస్తున్నట్టు సమాచారం.
ఈ పరంపరలో సీపీఎం అనుబంధ దినపత్రిక ప్రజాశక్తి ఎడిట్ పేజీలో ”తిరుమలలో సామాజిక వివక్షపై మీ వైఖరి ఏమిటి?” అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలేంటో చూద్దాం.
“1936లో టిటిడి పాలక మండలి ఏర్పడింది. ఆ మొదలు 84 ఏళ్లలో ఇప్పటి వరకూ టిటిడి ఛైర్మన్, ఇ.ఓ, తిరుమల జెఇఓ, తిరుమల ఆలయ డిప్యూటీ ఇఓలుగా దళితులు ఎంపిక కాలేదంటే కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఈ నెల 9వ తేదీన టిటిడి 26వ ఇ.ఓ గా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ చర్చ ముందుకు వచ్చింది. నేటికి 50 మంది ఛైర్మన్లు, 26 మంది ఇ.ఓ.లు మారారు. వీరిలో దళితుడు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తుంది” అని కందారపు మురళి ఆవేదనతో రాసుకెళ్లారు.
టీటీడీ చైర్మన్‌గా, ఈవోగా, తిరుమల జేఈవోగా దళితులను నియమించాలనే డిమాండ్ చాలా న్యాయమైంది. ఇందులో రెండో అభిప్రాయానికే తావులేదు. కానీ జవహర్‌రెడ్డి నియామకం నేపథ్యంలో కందారపు మురళి, మరికొందరు కలిసి వివాదాస్పదం చేయడమే ఆశ్చర్యంగా ఉంది.
రాజకీయంగా కందారపు మురళి సీపీఎంకు చెందిన నేత. ఏదైనా ఒక అంశంపై మాట్లాడాలని భావించినప్పుడు మనకు నైతిక హక్కు ఉందా? అని సంస్కారులెవరైనా చేసే పని. చిత్తశుద్ధి లేని శివపూజలేలా? అని ఆధ్యాత్మిక విప్లకారులు ఏనాడో చెప్పారు. సీపీఎం నేత కందారపు మురళి అంటే ఎందుకనే అలాంటి విషయాలన్నీ మనసులో మెదిలాయి.
నేటికి 50 మంది ఛైర్మన్లు, 26 మంది ఈఓ.లు మారారని, వీరిలో దళితుడు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడంపై విస్మయపోతున్న మురళికి దళిత సామాజిక వర్గం కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సీపీఎంకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే తను ఉంటున్న చిత్తూరు జిల్లా సీపీఎం కార్యదర్శిగా ఇంత వరకూ ఒక్క దళితుడు కూడా లేకపోవడం ఎప్పుడూ విస్మయం కలిగించలేదా?
టీటీడీ పదవుల్లో దళితులు ఎందుకు లేరు? ముఖ్యమంత్రులుగా ఎప్పుడూ అగ్రకులాల వాళ్లేని అని ప్రశ్నించే సీపీఎం నేతలు, తమ పార్టీ విషయానికి వచ్చేసరికి ఆ నీతినియమావళిని ఎందుకు పాటించడం లేదనే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారా? పార్టీలో సామాజిక వివక్షపై కనీసం ఎన్నడైనా తమ అంతరాత్మలనైనా సీపీఎం నేతలు ప్రశ్నించుకున్నారా?
1964లో సీపీఐలో సిద్ధాంత విభేదాలతో కొందరు బయటికి వచ్చి సీపీఎంగా సొంత కుంపటి ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేసిన వాళ్లలో కనీసం ఒక్కరంటే ఒక్కరైనా దళితులున్నారా? అంతెందుకు నిన్నటికి నిన్న రాష్ట్రంలోనే ఏకైక దళిత సీపీఎం కార్యదర్శిగా ఉన్న కడప జిల్లాకు చెందిన ఆంజనేయులును ఎందుకు తొలగించారో సమాధానం చెబుతారా?
సీపీఎం ఆవిర్భవించినప్పటి నుంచి పుచ్చలపల్లి సుందరయ్య (రెడ్డి), కొరటాల సత్యానారాయణ (కమ్మ), బీవీ రాఘవులు (కమ్మ), ప్రస్తుత సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు (రెడ్డి) ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ అంటే కమ్మ, రెడ్డి అనే విమర్శలు ఉత్త పుణ్యానికే వచ్చాయా? ఈ నాయకులే రెండు మూడు దఫాలుగా కార్యదర్శులుగా కొనసాగడం వాస్తవం కాదా?.
అలాగే పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర ముఖ్యమంత్రులుగా కనీసం ఒక్క దళితుడినైనా నియమించారా? అబ్బే …లేనేలేదు. కొత్త నాయకత్వా న్ని తయారు చేయలేకపోవడం ఈ నాయకుల అసమర్థత కాదా? ఒకవేళ నాయకత్వ లక్షణాలు, సిద్ధాంతపరమైన మేధస్సు కేవలం, కమ్మ, రెడ్ల సొంతమని పార్టీ భావిస్తోందా?
ఒకవేళ కొత్త వారు వస్తే … తమ పదవులకు ఎక్కడ గండిపడుతుందోననే భయమా? అయినా ఎప్పుడైనా కొత్తవారిని పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం పార్టీ చేసిందా? ఉన్న వాళ్లను ఎలా బయటికి పంపాలో వామపక్ష పార్టీల నేతలకు తెలిసినంతంగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు.
ఏపీలో సీపీఎం సభ్యత్వం ఎంత? అందులో కులాల వారీగా ఎవరెక్కువో కందారపు మురళి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? సీపీఎం సభ్యత్వం తీసుకున్న వాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలే ఎక్కువ. కానీ రాష్ట్రస్థాయి నాయకత్వంలో వారి ప్రాతినిథ్యం ఎంతో ఆ పార్టీ నేతలు నిజాయతీగా ప్రకటించే దమ్ము, ధైర్యం ఉందా? సీపీఎం రాష్ట్ర నాయకత్వంలో కూడా అగ్రకులాల నేతలే ఎక్కువ. అగ్రకులాల వారిని పల్లకీల్లో మోసే బోయీలుగా నిమ్న కులాలను చూడడం వాస్తవం కాదా?
తిరుమల ఈవో జవహర్‌రెడ్డి నియామకం గురించి వివాదం చేస్తున్న కందారపు మురళి …తన సొంత పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్ష గురించి అగ్రనేతలను ఎప్పుడైనా ప్రశ్నించారా? ఒక వేళ ప్రశ్నించి వుంటే సమాధానం ఏంటో బహిరంగ పరిచారా? జగన్ సర్కార్‌ను దెబ్బతీసేందుకు కొన్ని మతతత్వ శక్తులు తిరుమలను ఓ ఆయుధంగా చేసుకున్నాయి. లౌకక వాదం పేరుతో ఉపన్యాసాలు ఇచ్చే కందారపు మురళి తానెత్తుకున్న అంశం అలాంటి శక్తులకు దోహదపడుతుందే తప్ప ఒరిగేదేమీ వుండదు.
హిడన్ ఎజెండాను మురళి తన మనసులో పెట్టుకుని అనవసర వివాదాన్ని సృష్టించాలని భావిస్తున్నారా? ఇలాంటి సమస్యలతో సోషల్ మీడియాలో హైలెట్ అయితే …ఎల్లో చానళ్ల నుంచి డిబేట్లకు పిలుపు వస్తుందనే ఛీప్ ట్రిక్స్‌తో, పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారా? దళితులపై నిజంగా ప్రేమ , గౌరవం వుంటే ముందు తన పార్టీని చక్కదిద్దుకుని, ఆ తర్వాత మిగిలిన సంస్థలు, పార్టీల గురించి మాట్లాడితే విలువ ఉంటుంది.
ఇదే ప్రశ్నను కందారపు మురళితో కలిసి నడుస్తున్న కుల సంఘాల నాయకులు కూడా వేయాలి. అప్పుడే వారి బండారం బయట పడుతుంది.