నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఫలితం అందరూ ముందుగా ఊహించినట్టే వచ్చింది. ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇస్తూ భారీ మెజారిటీ తో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మొత్తం 824 ఓట్లు ఉండగా పోలైనవి 823 ఓట్లు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. వీటిలో టీఆర్ ఎస్ 728 ఓట్లు గెలుచుకుంది. ఆ తర్వాత బీజేపీ 56 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 29 ఓట్లు పొందగా 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ విజయాన్ని సాధించడంతో సంబరాలు చేసుకుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. నిజానికి పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి తర్వాత 16 నెలలుగా ఆమె ఏ పదవినీ చేపట్టలేదు. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పుడే టీఆర్ఎస్ తరఫున కవిత నామినేషన్ వేసినప్పుడే గెలుపు ఖాయం అని భావించినా… ఆమెకు భారీ మెజారిటీ వచ్చేలా టీఆర్ఎస్ నేతలంతా కృషి చేశారు.
కవిత గెలుపు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నారాయణరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన కవితకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తనకు సహకరించి గెలిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు చైర్మన్లతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు కవిత ధన్యవాదాలు చెప్పారు.