విజయ్ సేతుపతి నటిస్తున్న ముత్తయ్య బయోపిక్ '800' మోషన్ పోస్టర్...!
విజయ్ సేతుపతి నటిస్తున్న ముత్తయ్య బయోపిక్ '800' మోషన్ పోస్టర్...!

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి.. శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ క్రికెట్ లో తన బౌలింగ్‌ మాయాజాలంతో ఎంతోమంది స్టార్ బ్యాట్స్ మ్యాన్స్ కి దడపుట్టించిన ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ”800” అనే టైటిల్ ఖరారు చేశారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో మురళీధరన్‌ 800 వికెట్స్ తీసిందనుకు గుర్తుగా ఈ టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెస్‌ శ్రీపతి దర్శకత్వంలో రూపొందనున్న ఈ బయోపిక్ ని ‘మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్’ మరియు ‘డార్ మోషన్ పిక్చర్స్’ బ్యానర్స్ పై వివేక్ రంగాచారి నిర్మించనున్నారు. తాజాగా ”800” చిత్ర మోషన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
‘800’ చిత్ర మోషన్ పోస్టర్ ద్వారా అందరికి తెలిసిన మురళీధరన్ సక్సెస్ తో పాటు.. అందరికీ తెలియని ఆయన జీవిత ప్రయాణం గురించి చూపించబోతున్నారని తెలియజేసారు. ముత్తయ్య పెరిగిన నేపథ్యం.. గల్లీ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్ గా ఎదిగిన వైనం.. శ్రీలంకలో బాంబ్ బ్లాస్టులు మరియు పాకిస్థాన్ పర్యటనలో శ్రీలంక క్రికెటర్స్ ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు.. మురళీధరన్ బౌలింగ్ శైలిపై పరీక్షలు నిర్వహించడం.. ఈ మోషన్ పోస్టర్ లో చూపించారు. అలానే చివర్లో మురళీధరన్ పాత్రలో ఒదిగిపోయిన విజయ్ సేతుపతి లుక్ రివీల్ చేశారు.

కాగా, శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ బౌలింగ్ శైలి విభిన్నంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అలాంటి వైవిధ్యమైన బౌలింగ్ స్టైల్ ని అలవాటు చేసుకోవడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు. అయితే విజయ్ సేతుపతిగతంలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో మురళీధరన్‌ పాత్ర‌తో విజయ్‌ మెప్పిస్తాడని దర్శక నిర్మాత‌లు ధీమాగా ఉన్నారని తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే విజయ్ సేతుపతి బౌలింగ్ ప్రాక్టీస్‌ చేస్తూ మెలుకువలు నేర్చుకోవడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటున్న ఈ బయోపిక్ ని తమిళంతో పాటు ఇతర భాషల్లో ఒకేసారి రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here