అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ  సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిఆదేశించారు.  జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వర్షాల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవిన్యూ శాఖ పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ఇతర శాఖలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలు కారణంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

అవసరం ఉన్న ప్రాంతంలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అనవసరంగా బైటికి రావద్దని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లోతట్టు ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా తమ్మిలేరుకు  వరద ఉధృతి పెరిగింది. అక్కడ 5000 క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో  ఏలూరు తమ్మిలేరుకు ఇరు వైపుల ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరులోని లోతట్టు ప్రాంతంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టండి అని ఆయన అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఉదయం  6:30 నుంచి 7: 30 మధ్య  కాకినాడకు అతి సమీపంలో వాయుగుండం తీరం దాటిందని   విపత్తుల శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు తెలిపారు. ఈ కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here