CSK: ధోనీ అంటే పిచ్చి అభిమానం.. ఇల్లంతా ఇలా మార్చేశాడు!
CSK: ధోనీ అంటే పిచ్చి అభిమానం.. ఇల్లంతా ఇలా మార్చేశాడు!

మనదేశంలో ధోనీని అభిమానించే వారు కోట్లలో ఉంటారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నందున.. తమిళనాడులో ధోనీ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. మిగతా ప్రపంచానికి అతడు మహేంద్ర సింగ్ ధోనీ అయితే.. తమిళ తంబీలకు మాత్రం తల, తలైవా. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ గతంలో మాదిరిగా ఆడకపోయినప్పటికీ.. హార్డ్ కోర్ అభిమానులు మాత్రం ధోనీ పట్ల నమ్మకంతో ఉన్నారు. 2010 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు.

ధోనీ అంటే పడి చచ్చేంత అభిమానం ఉన్న ఓ వ్యక్తి.. తన ఆరాధ్య క్రికెటర్ పట్ల అభిమానం చాటుకోవడం కోసం.. తనకు ఇష్టమైన ఫ్రాంచైజీకి మద్దతు పలకడం కోసం ఇంటి గోడలను పసుపు రంగులోకి మార్చేశాడు. గోడలపై ధోనీ చిత్రాలను గీయించి.. చెన్నై సూపర్ కింగ్స్ లోగో.. విజిల్ పోడు అనే అక్షరాలను రాయించాడు. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని కడలూరు జిల్లా అరంగూరుకు చెందిన గోపీ కృష్ణన్ గత 12 ఏళ్లుగా దుబాయ్‌లో ఫారెక్స్ ట్రేడర్‌గా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం సొంతూరు వచ్చిన ఆయన.. చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతుగా ఇంటిని మొత్తాన్ని ఇలా పసుపు రంగులోకి మార్చేశాడు. ఇంటి ముందు ధోనీ ఫ్యాన్ ఇల్లు అని కూడా రాయించాడు.

ఈ సీజన్లో యెల్లో ఆర్మీ సరిగా ఆడకపోవడంతో.. ధోనీ కెప్టెన్సీపై విమర్శలొస్తున్నాయి. ఇంతకు ముందు వరకూ మహీపట్ల అభిమానం చూపిన వారే ఇప్పుడు అతణ్ని విమర్శిస్తున్నారు. అందులో గోపీ సన్నిహితులు కూడా ఉన్నారు. దీంతో తట్టుకోలేకపోయిన గోపీ.. వాళ్ల నోళ్లు మూయించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంటిని పూర్తిగా పసుపు రంగులోకి మార్చేయడం కోసం రూ. 1.5 లక్షలు ఖర్చు చేశాడు.

గోడలపై ధోనీ చిత్రాలు చిత్రీకరించడం కోసం స్కూళ్లో డ్రాయింగ్ టీచర్‌గా పని చేసే పొన్ను సెల్వరసు సాయం తీసుకున్నానని గోపీ తెలిపాడు. ఇద్దరికీ బాగా పరిచయం ఉండటంతోపాటు.. పొన్ను కూడా ధోనీ ఫ్యాన్ కావడంతో.. ఈ పనికి డబ్బులు ఎక్కువగా తీసుకోలేదట. ఇంటిని పూర్తిగా పసుపు రంగులోకి మార్చేసిన దగ్గర్నుంచి ధోనీ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చి చూడటంతోపాటు.. తనతో సెల్ఫీలు తీసుకుంటున్నారని గోపీ తెలిపాడు. పొన్ను ఆయిల్ పెయింటింగ్‌‌తో గీసిన ధోనీ చిత్రాలను చూసి.. తమకు కూడా అలాంటి చిత్రాలు గీయాలని కోరుతూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారట.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here