ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులో కురిసిందా?
ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులో కురిసిందా?

బంగాళాఖాతంలో వాయిగుండం అప్పుడప్పుడు ఏర్పడేవే. దీని ప్రభావంతో ఏపీతో పోలిస్తే తెలంగాణలో తక్కువ. మహా అయితే ఆకాశం ముసురుపట్టటం.. వర్షాలు పడటం జరుగుతుంటాయి. అన్ని వాయుగుండాలు ఒకేలా ఉండవన్నట్లుగా తాజాగా  తీరం దాటిన వాయుగుండం తెలంగాణ రాష్ట్రానికి మర్చిపోలేని విషాదాన్ని.. వేదనకు గురయ్యేలా చేసింది. అన్నింటికి మించి తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఒక్కరోజులో కురిసిన వర్షం లెక్క తెలిస్తే షాక్ తినాల్సిందే.

హైదరాబాద్ తో సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షం భారీగా నమోదైనట్లు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే సగటుకు మించి 404 శాతంఅధికంగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇది 54 శాతం మాత్రమే కావటం గమనార్హం. ఈ గణాంకం ఒక్కటి చాలు.. హైదరాబాద్ ను మంగళవారం నాటి వర్షం ఎంతలా అతలాకుతలం చేసిందో అర్థమవుతుంది. ఇంటి బయట ఉంచిన కార్లు.. బైకులు వర్షం ధాటికి కొట్టుకుపోయాయి. పలువురు గల్లంతైనట్లుగా చెబుతున్నారు. వీరికి సంబంధించిన ఆచూకీ ఇప్పటికి లభించలేదు.

అక్టోబరు 1 నుంచి 14 వరకు హైదరాబాద్ లో కురిసిన వర్షం సాధారణం కంటే 404 శాతం అధికం కావటం ఒక విశేషంగా చెబుతున్నారు. అది ఒక రోజులోనే ఇంత భారీగా వర్షపాతం నమోదు కావటం ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఏళ్లకు ఏళ్ల తర్వాత మూసీకి ఇంత భారీగా వరద రావటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

అక్టోబరు 14న రాష్ట్ర సగటు సాధారణ వర్షపాతం కేవలం 3 మిల్లీ లీటర్లు. కానీ.. కురిసింది మాత్రం ఏకంగా 5.7 సెంటీమీటర్లు. జూన్ నుంచి అక్టోబరు 14 వరకు తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం 78సెంటీమీటర్లు. అయితే.. కురిసింది మాత్రం 120.6 సెంటీమీటర్లు. మూడు నెలల పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కురవాల్సిన వర్షం కేవలం 11 సెంటీమీటర్లు మాత్రమే. అందుకు భిన్నంగా మంగళవారం ఒక్కరోజులో తెలంగాణలోని 106 మండలాల్లో సాధారణం కంటే కూడా అధికంగా వర్షపాతం నమోదైంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షం కురిసిన జిల్లాల్లో యాదాద్రి భువనగిరి.. రంగారెడ్డి.. మేడ్చల్.. సంగారెడ్డి కాగా.. 11 నుంచి 20 సెంటీమీటర్ల లోపు వర్షం కురిసిన జిల్లాలుగా నల్గొండ.. రంగారెడ్డి.. హైదరాబాద్.. వికారాబాద్.. మెదక్.. సిద్దిపేట.. జనాగమ జిల్లాలు ఉన్నాయి. ఒక.. ఆరు నుంచి పదకొండు సెంటీమీటర్లవర్షపాతం నమోదైన జిల్లాల విషయానికి వస్తే కామారెడ్డి.. కరీంనగర్.. సిరిసిల్ల.. మహబూబాబాద్.. వరంగల్ గ్రామీణం.. వరంగల్ అర్బన్.. ఖమ్మం.. భద్రాద్రి.. సూర్యాపేట.. జోగులంబ జిల్లాలు ఉన్నాయి.

ఇంత భారీగా రాష్ట్రం మొత్తం వర్షాలు పడుతున్న వేళ.. వాన జాడ లేనిజిల్లాలు కూడా ఉండటం గమనార్హం. ఆ జిల్లాల విషయానికి వస్తే.. కుమురం భీం ఆసిఫాబాద్.. మంచిర్యాల.. నిర్మల్ జిల్లాల్లో వానదేవుడి ఊసే లేదని చెబుతున్నారు.  మంగళవారం దంచి కొట్టిన వానతో హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికితే.. బుధవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు వర్షం పడలేదు. కానీ.. రాత్రి 9 తర్వాత మొదలైన వర్షం అర్థరాత్రి దాటే వరకూ సాగింది. దీంతో.. హైదరాబాద్ వాసులు వణికిపోయిన దుస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here