మానసికంగా రెఢీ కండి..ఫిబ్రవరి నాటికి ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్
మానసికంగా రెఢీ కండి..ఫిబ్రవరి నాటికి ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్

ప్రపంచాన్ని వణికించిన కరోనా.. భారత దేశాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో తెలిసిందే. నెల క్రితం రోజుకు 90వేల కేసులకు పైనే నమోదు అయ్యే దుస్థితి నుంచి తాజాగా రోజుకు 50 వేల కేసులు నమోదయ్యే పరిస్థితికి మారాం. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? సెకండ్ వేవ్ ప్రభావం ఎంత ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివేళ.. గుండెలు అదిరే మాటను చెప్పారు ఫూణెకు చెందిన ఐఐటీ- కాన్పూరుకు చెందిన ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్.

కరోనా వేళ కేంద్రం నియమించిన కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. కొన్ని అంచనాల్ని తాజాగా వెల్లడించారు. ఇప్పటివరకు అందిన డేటాను అనుసరించి ఆయన కొన్ని లెక్కలు వేశారు. దీని ప్రకారం ఇప్పటివరకు దేశంలో 30 శాతం మంది జనాభా కరోనా బారిన పడినట్లుగా ఆయన పేర్కొన్నారు. రానున్న ఫిబ్రవరి నాటికి 50 శాతం జనాభా కరోనా పాజిటివ్ అవుతారని లెక్క కట్టారు.

సీరలాజికల్ సర్వేలో 14 శాతం జనాభాకు మాత్రమే కరోనా సోకినట్లుగా తేలిందని.. అయితే.. సర్వేకు తీసుకున్న నమూనా.. పరిమాణాల్ని చూస్తే అవి సరికాకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దానికి బదులుగా గణిత నమూనా ఆధారంగా లెక్కలు వేస్తే.. వచ్చే ఫలితం వేరుగా ఉంటుందని చెప్పారు. లెక్కల్లో చేరిన కేసులనే కాకుండా లెక్కల్లోకి రాకుండా ఉన్న వాటిని తాము పరిగణలోకి తీసుకున్నామని ఆయన చెబుతున్నారు.

మాస్కులు ధరించకపోతే తమ అంచనాలు మరింత మారుతాయని చెబుతున్న ఆయన మాటలు చూస్తే.. రానున్న కొద్ది నెలల్లో కేసుల సంఖ్య భారీగానే ఉంటాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లై అవుతుంది. మాస్కులు వాడకుంటే పరిస్థితి ఎంత దిగజారుతుందన్న విషయాన్ని ఆయన చెబుతూ.. ఒక్క నెలలో 26 లక్షలకొత్త కేసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట ఆ ప్రొఫెసర్ పెద్దాయన నోటి నుంచి రావటం గమనార్హం. కేసుల నమోదు తగ్గుతున్నాయన్న వేళ.. లైట్ తీసుకుంటే ముప్పు తప్పదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here