ప్రశ్నించటం పాపంగా మారుతోంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినా ఈ మధ్య కాలంలో పాలకులకు తెగ కోపం వచ్చేస్తుంది. గతంలో ఇరకాటంలో పడే ప్రశ్నలకు అనునయంగా సమాధానాలు చెప్పే దానికి బదులుగా.. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితి. ముందస్తు సమాచారం పెద్దగా ఇవ్వకుండా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి కేటీఆర్.. తాను మాట్లాడటానికి ముందే పాత్రికేయులకు ఒక మాట చెప్పేశారు. ఇప్పుడు ప్రశ్నలేమీ వద్దు.. చెప్పింది వినాలన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. విపత్తు వేళ.. చర్చలు ముఖ్యం కాదు. సహాయక చర్యలు ముఖ్యమన్న మాటను చెప్పేసిన ఆయన.. మీడియా ప్రతినిధుల నోటికి తాళాలు వేసేశారు.

ఒకవేళ ఎవరైనా అదే పనిగా లోతైన ప్రశ్నలు వేస్తే.. దానికి వచ్చే సమాధానాలు.. తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం తెలియటంతో.. ప్రెస్ మీట్ లో పాల్గొన్న చాలామంది పాత్రికేయులు మంత్రి కేటీఆర్ చెప్పింది రాసుకొని వచ్చారే కానీ సూటిగా ప్రశ్నలు వేసే సాహసానికి ప్రయత్నించలేదు. పాత్రికేయులు అడగని ప్రశ్నలు చాలానే ఉన్నా.. మంత్రి కేటీఆర్ కొన్నింటికి ఎప్పటికైనా సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.

గంటకు 200 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో వీచిన రాకాసి గాలులు.. రాడార్లు సైతం పని చేయని సంక్లిష్ట వాతావరణం నెలకొన్ని హూదూద్ తుపాను సమయంలో విశాఖ నగరంలో చనిపోయింది ముగ్గురు మాత్రమే. భారీ ఆస్తి నష్టం వాటిల్లినా.. మరణాలు మాత్రం కనిష్ఠంగా చోటు చేసుకున్నాయి. అలాంటిది గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షం కొన్ని ప్రాంతాల్లో కురవటం.. దానికి 33 మంది మరణించటం దేనికి సంకేతం?

ఈ మరణించిన వారిలో గోడ కూలిన ఉదంతంలో తొమ్మిది మంది బలి కావటాన్ని కూడా తీసేద్దాం. అలా చూసినా 24 మంది మరణించారు. మరి.. అన్ని మరణాలు కేవలం భారీవర్షాల కారణంగా చనిపోవటం దేనికి నిదర్శనం? భారీ వర్షాలు పడితే.. విశ్వనగరాలు.. మహానగరాల్లో కష్టాలు ఇలానే ఉంటాయని చెప్పే మంత్రి కేటీఆర్.. మరణాలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయా? అన్న క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కన ప్రచండ గాలులు వీసిన హూదూద్ లాంటి తీవ్రమైన పరిస్థితులు హైదరాబాద్ లో చోటు చేసుకుంటే.. మహానగర ప్రజల మాటేమిటి? అప్పుడేం జరుగుతుంది? ఊహించేందుకు సైతం భయం వేయట్లేదు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here