తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఒకటి. పేద వాడికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉండాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు.  తాజాగా నేడు  తొలివిడతగా 1152 ఇళ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించిన కెసిఆర్ అందుకోసం అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు.హైదరాబాద్లోని జియాగూడలో రెండు పడక గదుల డిగ్నిటీ హౌసింగ్ కాలనీని కేటీఆర్ మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశాలు చేశారు. ఈ డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో 840 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. కట్టెల మండి లో 120 గోడే కా కబర్ లో 192 ఇళ్లను మంత్రి కేటీఆర్ అర్హులైన నిరుపేదలకు అందించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలోనే టిఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లో పెట్టి నేడు తొలివిడత లో భాగంగా కొన్ని ఇళ్లను అందించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటిఆర్ ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతున్నారని ఈ రెండు పనులు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. అయితే ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా అని అన్నది సీఎం కేసీఆర్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం విజయదశమి కానుకగా సాకారం చేసిందని అన్నారు. ఈ కాలనీలో రూ.71.49 కోట్ల వ్యయంతో 840  ఇళ్లు నిర్మించారని తెలిపారు. ఇందులో తాగునీరు విద్యుత్ సీసీ రోడ్లు షాపింగ్ కాంప్లెక్స్తో పాటు బస్తీ దవాఖానా సదుపాయాలు కూడా ఉన్నాయని చెప్పారు.

తమ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా 18000 కోట్ల రూపాయలతో 275000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతుందని చెప్పారు.ఆలస్యమైనా సరే నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో డబ్బా ఇళ్లు కట్టేవారని వాటిలోనే అవినీతి జరిగేదని చెప్పారు. అంతేగాక కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కట్టకుండానే కట్టినట్లు చూపించి డబ్బులు దండుకున్నారని విమర్శలు చేశారు. తాము పైసా చెల్లించే అవసరం లేకుండానే పేదలకు ఇళ్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here