సమీక్ష: కలర్ ఫోటో
రేటింగ్: 2.5/5
బ్యానర్: అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, హర్ష చెముడు, దివ్య తదితరులు
కథ: సాయి రాజేష్
సంగీతం: కాల భైరవ
కూర్పు: కోదాటి పవన్ కళ్యాణ్
ఛాయాగ్రహణం: వెంకట్ ఆర్ శాఖమూరి
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
విడుదల తేదీ: అక్టోబరు 23, 2020
వేదిక: ఆహా

ప్రేమకు కులం, మతం, పేదధనిక అంతరం అడ్డు పడుతుంటాయనేది వందల కొలదీ సినిమాలకు కథా వస్తువయింది. ఈ చిత్ర రచయిత, దర్శకుడు… ఓ వ్యక్తి రంగు, రూపం ప్రేమకు అవాంతరమయితే ఏమవుతుందనేది చూపిస్తే కొత్తగా వుంటుందని భావించినట్టున్నారు. ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అనేది వరల్డ్ వైడ్ ట్రెండ్ అయినపుడు ఇది టైమ్లీ టాపిక్ అనిపించాలి. కానీ ఇండియాలో కులమత వివక్ష వున్నంతగా ఈ వర్ణ వివక్ష లేదు. మన దేశంలో రంగు అనేది అందానికి కొలబద్ద అవుతుందేమో కానీ ఒక మనిషికి ఇచ్చే విలువలో అది ప్రధాంనాంశం అవడం అరుదు.

తెల్లగా వుండాలనే తపన మన దేశీయులకు ఎక్కువే. అందుకే ఫెయిర్‌నెస్ క్రీమ్స్ బ్రాండ్స్ అన్ని కోట్లకు పడగలెత్తాయి. రంగు తక్కువ వున్న వాళ్లను అదీ, ఇదీ అనే పేర్లతో పిలవడం, ఆ పేరు మీద కామెడీ చేయడం జరుగుతుందేమో కానీ నువ్వు కలర్ తక్కువ కాబట్టి స్టేజీ ఎక్కడానికి వీల్లేదని ప్రిన్సిపల్ అనడమో, నీకు రంగు తక్కువ కనుక నా చెల్లెలికి తగినవాడవు కాదని అన్నయ్య అభ్యంతరం చెప్పడమో ఎక్కడైనా అరకొర సందర్భాలలో జరగవచ్చునేమో. అలాంటి అరుదైన విషయంపై ఫోకస్ పెట్టడం వలనే ఏమో ‘కలర్ ఫోటో’ ఎక్కడా రిలేటబుల్ అనిపించదు.

రంగొక్కటే సమస్యగా చూపించాలనుకున్నపుడు ఎట్‌లీస్ట్ లీడ్ క్యారెక్టర్ మిగతా అన్ని విషయాల్లోను టాప్ అని చూపించాలి. కానీ కాలేజీకి వెళ్లే ముందు ఇంటింటికీ పాలు ఇచ్చి వెళ్లేంత పేదవాడు ఇందులో కథానాయకుడు జయకృష్ణ (సుహాస్). అతను ప్రేమించే దీప్తి (చాందిని) తన కంటే కేవలం రంగులోనే కాదు చదువులోను, ఆస్తిఅంతస్తు, పరపతిలో కూడా ఎక్కువే. అయితే అతడి ప్రేమకు అవన్నీ కారణాలే కాదన్నట్టు, రంగొక్కటే మేటరన్నట్టు ఆమె అన్నయ్య రామరాజు (సునీల్) ప్రవర్తిస్తాడు.

తాను నల్లగా వున్నాడు కనుక తన చెల్లికి అందగాడినిచ్చి పెళ్లి చేస్తే ఆమెకు పుట్టే కూతురికి తన కొడుకునిచ్చి పెళ్లి చేసినపుడు వాళ్లకు పుట్టే పిల్లలు అందంగా వుంటారనేది అతని లాజిక్కు. తనకు తన పోలికలు లేదా రంగు రాని అందమైన అబ్బాయే పుట్టాలి, తన చెల్లికి ఖచ్చితంగా అమ్మాయే పుట్టాలి, వాళ్లిద్దరికీ పెళ్లి కావాలి లాంటి లాజిక్కులేమీ అతడికి పట్టవు.

ఈ ప్రేమ జంటకు ‘రంగు’ అతి పెద్ద అడ్డంకి కావాలని దర్శక, రచయితలు భావించారు కనుక విలన్‌కి కూడా అదొక్కటే అజెండా. అతని మాట అటుంచితే… మన హీరో ప్రతిభాపాటవాలను మెచ్చుకునే కాలేజీ ప్రిన్సిపల్ ఒక రోజు సడన్‌గా హీరో రూపలావణ్యాలను కించ పరిచేలా మాట్లాడతాడు. అప్పటివరకు బాగున్నవాడికి సడన్‌గా ‘తెల్ల దెయ్యం’ పట్టి వుంటుందిలే అనుకోవాలి మనం.

ఆ అసందర్భపు ప్రవర్తనకు కొనసాగింపుగా మళ్లీ హీరోతో ఒక ఎలివేషన్ స్పీచ్ కూడా ఇప్పిస్తారు. ఇంత బాధ ఎందుకు పడ్డారా అంటే హీరో లవ్‌స్టోరీ బయట పడినపుడు ప్రిన్సిపల్ అతడికి ఫేవర్‌గా వుండకూడదు. అలాంటప్పుడు అసలు అతడిపై ప్రిన్సిపల్‌కు మంచి అభిప్రాయం వున్నట్టే చూపించకుండా వుంటే పోతుంది కదా?

పోనీ సదరు బ్లాక్ కలర్ మన హీరో లవ్‌స్టోరీలో ఏమైనా రోల్ పోషిస్తుందా అంటే అదీ లేదు. అసలు అతడిని ఆమె ప్రేమించడానికి కారణమేంటి, తనపై అంతటి ప్రేమ ఎప్పుడు కలిగిందీ వంటివేమీ చూపించరు. ఆ రిలేషన్, ఎమోషన్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన టైమ్‌లో సీనియర్  జూనియర్ గొడవలు పెట్టి సాగదీస్తూ వెళ్లారు.

ఒకసారి ఇద్దరూ ప్రేమించేసుకున్నాక ఇక ఆ సంగతి బయట పడకుండా ఎలా సీక్రెట్‌గా దాచి పెడుతూ తమ బంధం కొనసాగిస్తున్నారనేది సుదీర్ఘంగా చూపిస్తారు. ఏదో ఒక పాయింట్‌లో ఆమె అన్నయ్య దిగుతాడనేది ఆరంభంలో ఇచ్చిన బిల్డప్‌తోనే అర్థమవుతుంది కనుక ఈ లవ్‌స్టోరీ ముగించడానికి అతడి ఎంట్రీ కోసం ఎదురు చూడాలి. ఈ పాయింట్ నుంచి ఎమోషనల్‌గా కదిలించాలి, హీరో పాత్రపై సింపతీ కలిగించాలని చేసిన ఎన్నెన్నో ప్రయత్నాలలో ఏదీ కదిలించవు. ఎమోషన్ స్కేల్‌లో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ వాడేసినా కానీ ఎఫెక్ట్ మాత్రం అసలుండదు.

అయితే లీడ్ రోల్ చేసిన సుహాస్ సిన్సియర్ పర్‌ఫార్మెన్స్ మెప్పిస్తుంది. తన పాత్రలో ఒదిగిపోయి తన పర్‌ఫార్మెన్స్ తాలూకు రేంజ్ ఏమిటనేది అతను చూపించాడు. చాందిని చౌదరి కూడా దుడుకు స్వభావం వున్న అమ్మాయిగా సహజ నటన కనబరచింది. సునీల్ విలన్ పాత్రను రక్తి కట్టించడానికి శాయశక్తులా కృషి చేసినా కానీ ఆ పాత్ర వల్ల కలగాల్సిన భయం లేదా ఉత్కంఠ కలగదంటే అందుకు కారణమేంటనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఓటిటికి వచ్చిన చిన్న సినిమాలలో పెద్ద రోల్స్ పోషిస్తోన్న హర్షకు ఇందులోను మంచి వేషం దక్కింది. తన మార్కు హాస్యం బాగానే పండింది. నిర్మాణ పరంగా జాగ్రత్తలు తీసుకుని అతి తక్కువ బడ్జెట్‌లో రూపొందించిన ఈ చిత్రంలో సాంకేతిక విభాగంలో స్టాండ్ అవుట్‌గా నిలిచేది కాలభైరవ అందించిన సంగీతం. అతడి నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. లేట్ నైన్‌టీస్ బ్యాక్‌డ్రాప్ కోసం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పెట్టిన శ్రద్ధ తెలుస్తుంది.

కథాపరంగానే యాక్సప్టబులిటీ తక్కువ వున్న పాయింట్‌కి ఆకట్టుకునే కథనం కూడా కుదరకపోవడంతో ‘కలర్ ఫోటో’ బ్లర్ అయింది. కులమతాలు పసి ప్రేమలను చిదిమేస్తోన్న ఉదంతాలు ఇప్పటికీ హెడ్‌లైన్స్ అవుతోన్న టైమ్‌లో లవ్ కాన్‌ఫ్లిక్ట్‌కి ఇలా కొత్త రంగులు పులమాల్సిన పని లేదు. ఇవేం లేకుండా రియాలిటీ చూపించినా ఇంతకు మించిన ఎమోషనే జనరేట్ అయి వుండేదేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here