శిక్షాకాలం ముగింపు దగ్గరపడింది. జరిమానా చెల్లింపే ఇంకా మిగిలింది. రూ.10 కోట్ల భారీ మొత్తం కర్ణాటక జైళ్ల ఖాతాలో జమైతే తరువాత పరిణామాలు చిన్నమ్మను చిక్కుల్లో పడేస్తాయని ఆమె వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. 2017 ఫిబ్రవరి 14వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో వారంతా శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ముగుస్తుండగా, ఖైదీల స్రత్పవర్తన కింద శశికళ ముందే విడుదలవుతారని ఆమె న్యాయవాది పలుమార్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహన్‌ సమాచార హక్కు చట్టం కింద ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కోరినపుడు వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కాగలరని జైళ్లశాఖ బదులిచ్చింది. పెరోల్‌పై బయటకు వచ్చిన రోజులను మినహాయించి స్రత్పవర్తన కింద 120 రోజుల మందే శశికళ విడుదల ఖాయమని ఆమె అభిమానులు ధీమాతో ఉన్నారు. జైలు అధికారులను మభ్యపెట్టి శశికళ బెంగళూరు నుంచి అనధికారికంగా బయటకు వచ్చి షాపింగ్‌లు చేసినట్లు గతంలో బెంగళూరు జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపించి నిరూపించినట్లు తెలుస్తోంది. స్రత్పవర్తన పరిధిలోకి శశికళ రారని కూడా అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here