అన్నం పెట్టుకోమన్న భార్య.. అమలాపురంలో దారుణం
అన్నం పెట్టుకోమన్న భార్య.. అమలాపురంలో దారుణం

ఫుల్లుగా తాగొచ్చిన భర్త భోజనం వడ్డించమనడంతో భార్య నిరాకరించింది. నువ్వే పెట్టుకోమనడంతో భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు. మద్యం మత్తులో ఘాతుకానికి తెగబడ్డాడు. గొడ్డలితో నరికి అమానుషంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పరిధిలో జరిగింది. అల్లవరం మండలం యెంట్రుకోనకి చెందిన ఉల్లంగి శ్రీనివాసరావు బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్లొచ్చాడు. ఫుల్లుగా మద్యం తాగి ఇంటికొచ్చి భోజనం వడ్డించాలని భార్య వెంకటలక్ష్మి(40)ని అడిగాడు.
అందుకు ఆమె నిరాకరించడంతో పాటు నువ్వే పెట్టుకోమని కోపంగా చెప్పడంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని తలపై బలంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన వెంకటలక్ష్మి ఇంట్లోనే రక్తపు మడుగులో కుప్పకూలింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మూడేళ్ల పాటు కువైట్‌లో పనిచేసి 3 నెలల కిందటే స్వగ్రామానికి వచ్చిన వెంకటలక్ష్మి భర్త చేతిలో హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఆమెకి ఇద్దరు కుమారులు సంతానం. సమాచారం అందుకున్న అమలాపురం డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here