ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది.

ఇది ఈ నెల 15 నాటికి వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది.

ఆ తర్వాత మరింత బలపడి 16వ తేదీ నాటికి తుఫాన్‌గా మారనున్నదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, వేటలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది.

తుఫాన్‌ కారణంగా అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణం అనుకూలంగా మారిందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

తుఫాన్‌తో కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, వర్షాలకు అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు.

ఈ తుఫాన్‌కు ‘యాంపిన్‌’ (థాయల్యాండ్‌ సూచించిన పేరు)గా నామకరణం చేయనున్నారు.

కాగా గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కానుందని వాతావరణ కేంద్రం వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here