హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్న రాఖీ భాయ్..!
హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్న రాఖీ భాయ్..!

దేశ వ్యాప్తంగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘కేజీఎఫ్’. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ‘కన్నడ బాహుబలి’ గా పిలవబడుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ మొదటి భాగం పాన్ ఇండియన్ లెవల్లో విడుదలై అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించింది. అత్యధిక వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రంగా.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సౌత్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇప్పుడు ‘కేజీఎఫ్’ 2వ అధ్యాయం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా రాకపోయుంటే ఈపాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే స్టార్ట్ చేసిన షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

‘కేజీఎఫ్ 2’ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుందని సమాచారం. దీని కోసం హీరో యష్ రేపు హైదరాబాద్ రానున్నాడని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇందులో ప్రతినాయకుడు ‘అధీరా’ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా పాల్గొననున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లేట్ అయితే 2021 ప్రథమార్థంలోవిడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కోలార్ ఫీల్డ్ గనుల నేపథ్యంలో మాఫియా కథతో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని హెంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి రవీ బాస్రుర్ సంగీతం సమకూరుస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here