రామతీర్థం సంఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి వారిని శిక్షించడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు మత విద్వేశాలను  రెచ్చగొట్టవద్దని హితవు పలికారు.

ఇప్పటికే తిరుమల శ్రీవారు ఒకసారి స్వయంగా చంద్రబాబుకు ఒక హెచ్చరిక పంపాడని.. ప్రతిపక్ష నాయకుడు ఒకసారి చావుకు దగ్గరగా వెళ్లినా కూడా ఇంకా గుణపాఠం నేర్చుకోలేకపోయాడని స్పీకర్ తమ్మినేని గుర్తు చేశారు. అలీపిరిలో మందుపాతర పేలి చంద్రబాబు బతికి బయటపడ్డ సంఘటనను గుర్తుంచుకోవాలని చంద్రబాబుని స్పీకర్ తమ్మినేని హెచ్చరించాడు. దేవుళ్లతో రాజకీయం ఆపాలని కోరాడు.

మత భావనలను ప్రేరేపించడం ద్వారా ఎవరిపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారని స్పీకర్ తాజాగా చంద్రబాబుని ప్రశ్నించారు. రాముడు జన్మించిన ఈ వేదభూమిలో విగ్రహ మొండెం నుండి తల వేరు చేయడం నైతిక నేరం కాబట్టి చంద్రబాబు ఈ సంఘటనను ఖండించడానికి ప్రయత్నించాలని హితవు పలికారు.

వైసీపీ కూడా అలాంటి చర్యలకు పాల్పడదని.. ఇలాంటి నేరానికి ఎవరూ మద్దతు ఇవ్వరని సీతారాం స్పష్టం చేశారు. పురాతన విగ్రహాలను ధ్వంసం చేయడం వెనుక ఉన్న నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

ఇక చంద్రబాబుకు మరో సవాల్ ను స్పీకర్ తమ్మినేని సీతారం విసిరారు. ‘ఓటుకు నోటు కేసులో ఫోన్ రికార్డ్ లో నీ గొంతు కాదని దబాయిస్తే.. కాణిపాకంలోని విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేద్దాం రా?’ అని చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని సీతారం సవాల్ విసిరారు.

ఇటీవల నారాలోకేష్ ప్రమాణాలు చేద్దాం రా అని సీఎం జగన్ కు సవాల్ విసిరిన నేపథ్యంలో చంద్రబాబును ఇరుకునపెట్టేలా స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి తమ్మినేని సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తాడా? లేదా అన్నది వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here