ప్రియమణి పేరు వినగానే ‘పెళ్లైన కొత్తలో’ సినిమా గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ తో కలిసి ‘యమదొంగ’ సినిమాలో ఆమె చేసిన సందడి కళ్లముందు కదలాడుతుంది. తమిళ మూలకథతో చేసిన ‘చారులత’ .. తెలుగులో నాయిక ప్రధానంగా నడిచే కథతో చేసిన ‘క్షేత్రం’ సినిమాలు ప్రియమణి నటనకు మచ్చుతునకగా కనిపిస్తాయి. గ్లామర్ హీరోయిన్స్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటూనే ఆమె తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలలోను తన ప్రత్యేకతను చాటుకుంది.
తెలుగులో ప్రియమణికి ఆశించినస్థాయిలో గుర్తింపు రాలేదనే చెప్పాలి. పెద్ద హీరోల సరసన ఆమెకి అవకాశాలు దక్కకపోవడం .. వచ్చిన అవకాశాలతోనే సర్దుకుంటే విజయాలు చిక్కకపోవడం జరిగింది. దాంతో సహజంగానే ఆమె ఇతర భాషా చిత్రాల వైపు మొగ్గుచూపింది. తమిళంలో కంటే కూడా మలయాళ .. కన్నడ చిత్రపరిశ్రమలు ఆమెను ఎక్కువగా ఆదరించాయి. దాంతో కెరియర్లో గ్యాప్ రాకుండా ఆమె చూసుకోగలిగింది. ఒక నటిగా తన సత్తాను చాటుకోగలిగింది. ఒకానొక దశలో ఆమె పూర్తిగా కన్నడ సినిమాలతో బిజీ అయిపోయింది.
అలాంటి ప్రియమణిని వెతుక్కుంటూ ఇప్పుడు తెలుగు నుంచి వరుస అవకాశాలు వెళుతుండటం విశేషం. ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది సినిమాలు ఉంటే అందులో నాలుగు తెలుగు సినిమాలే. ఆ నాలుగు సినిమాల్లో ‘నారప్ప’ .. ‘విరాటపర్వం’ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘నారప్ప’ సినిమాలో వెంకటేశ్ భార్య ‘సుందరమ్మ’ పాత్ర తన కెరియర్లోనే గొప్ప పాత్రగా నిలుస్తుందని ప్రియమణి నమ్మకంగా చెబుతోంది. తన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటోంది. ఇక ‘విరాటపర్వం’ సినిమాలో ‘కామ్రేడ్ భరతక్క’ పాత్రకి కూడా మంచి గుర్తింపు లభిస్తుందని నమ్మకంగా చెబుతోంది. మొత్తానికి ప్రియమణి తెలుగులో మళ్లీ బిజీ అవుతుందన్న మాట!