కమల్ హాసన్ లా మూకీ ప్రయోగం చేస్తున్న టాప్ హీరో
కమల్ హాసన్ లా మూకీ ప్రయోగం చేస్తున్న టాప్ హీరో

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన క్లాసిక్ మూవీ `పుష్పక విమానం`.. మూకీ కేటగిరీలో రిలీజై సంచలనం సృష్టించింది. లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో మాట రాని మూగవాడిగా కమల్ హాసన్ సైగ భాష నటన ఎప్పటికీ అభిమానులు మరువలేరు. ఆ తర్వాత పలు చిత్రాలు వచ్చినా అవేవీ అంతగా గుర్తింపును తెచ్చుకోలేదు.

ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆ తరహా ప్రయోగం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న మూకీ మూవీ టైటిల్ -గాంధీ టాక్స్.
సేతుపతి తన 43 వ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కిషోర్ పాండురంగ్ బెలేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గాంధీ టాక్స్ ఒక నిశ్శబ్ద చిత్రం. ‘నిశ్శబ్ద యుగాన్ని మరోసారి సెలబ్రేట్ చేద్దాం’ అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ లో నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది డబ్బు నేపథ్యం.. క్రైమ్ థ్రిల్లర్ తరహా ప్రయోగం అని అర్థం చేసుకోవచ్చు.

పోస్టర్ ను షేర్ చేసిన విజయ్ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. “కొన్ని సమయాల్లో నిశ్శబ్దం చాలా బిగ్గరగా ఉంటుంది“ అని వ్యాఖ్యానించారు. నేను ఒక కొత్త సవాల్ కు .. కొత్త జానర్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను.. మీ ప్రేమ దీవెనలు కావాలి.. అని ఆకాంక్షించారు.

విజయ్ సేతుపతి మరోవైపు బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారని కథనాలొస్తున్నాయి. ముంబై మీడియా కథనాల ప్రకారం.. బాలీవుడ్ అరంగేట్ర మూవీలో కత్రినతో రొమాన్స్ చేయనున్నారని .. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. నయనతార- సమంత అక్కినేని నాయికలుగా విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న `కాతువాకుల రేండు కదల్` లోనూ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here