ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై చర్చించడానికి ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి సమావేశం కానున్నారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌ను ఇచ్చే అంశంపై వారు చర్చిస్తారు.
2017–18 ధరల ప్రకారం నిధులిస్తేనే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(PPA) కేంద్ర జలసంఘం(CWC) పూర్తి స్థాయిలో ఏకీభవించి ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఖరారుచేసి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు జల్‌శక్తి శాఖ కసరత్తు చేస్తోంది.
ఫలించిన సీఎం జగన్ కృషి..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేయించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి ఫలించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకూ నీటిపారుదల విభాగం కింద నిధులు ఇస్తున్నారని పోలవరం ప్రాజెక్టుకూ సైతం అదే విధంగా నిధులు ఇవ్వాలని జగన్ కేంద్రాన్ని కోరారు. ఇదే విషయాన్ని అధికార యంత్రాంగం ద్వారా సమర్థవంతంగా కేంద్రానికి వాదనలు వినిపించారు. దీంతో.. పోలవరం అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.
ఆర్సీసీ ఆమోదించిన వ్యయానికే..
పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 2019 ఫిబ్రవరి 11న ఆమోదించింది. జాతీయ ప్రాజెక్టుల అంచనా వ్యయం 25 శాతం కంటే పెరిగితే.. వాటిని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)కి పంపి.. మదింపు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో ఆర్డర్స్ ఇచ్చింది. ఆ మార్గదర్శకాల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆర్సీసీకి ప్రతిపాదించారు. దీంతో.. కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47725.74 కోట్లుగా తేల్చి కేంద్ర జల్ శక్తి ఆర్థిక శాఖలకు నివేదిక ఇచ్చింది. ఈ అంచనా వ్యయానికే కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తుందని అధికారవర్గాలు తెలిపాయి.