సంచలనంగా మారిన గుడివాడ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య ఉదంతం ఒక కొలిక్కి వచ్చింది. ఆయన ఆత్మహత్యను సైతం రాజకీయం చేయటానికి ఏపీ విపక్షం ప్రయత్నించి ఫెయిల్ అయ్యింది. ప్రతి విషయానికిఏదో ఒక రాజకీయ రంగు పులమటం.. దాంతో రాజకీయ లబ్ధి పొందాలన్నది ప్రయత్నంగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే గుడివాడ ఎస్ఐ ఆత్మహత్య విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.
వాస్తవానికి ఎస్ఐ ఆత్మహత్య ఉదంతం పూర్తిగా ఆయన వ్యక్తిగతమైన అంశంగా చెబుతున్నారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం పేకాడ దాడుల నిర్వహణలో ఒత్తిళ్లకు తట్టుకోలేక చనిపోయినట్లుగా మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. ఈ విషయానికి సంబంధించి మాజీ మంత్రికి నోటీసులు జారీ చేయనున్నట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయటం.. ప్రతి విషయాన్ని అధికార పార్టీ తలకు చుట్టటం ఏపీలోని విపక్షానికి అలవాటైంది.
మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలపై స్పందించిన అధికారులు.. ఆయన చేసే ఆరోపణలకు ఆధారాలు చూపించాల్సిందిగా కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎస్ఐ విజయకుమార్ ఆత్మహత్య కేసులోఆయన ప్రియురాలు.. బ్యూటీషియన్ అయిన సురేఖను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కేసు తీవ్రత కారణంగా ఆమెకు పద్నాలుగు రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం వెల్లడించారు. దీంతో.. ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తలించారు.