తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం.ఒకే రోజు 6వేలకు పైగా కోళ్లు మృతి
తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం.ఒకే రోజు 6వేలకు పైగా కోళ్లు మృతి

మన దేశంలో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేలాదిగా పక్షులు మరణిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి కోళ్లు, గుడ్లు రవాణాను పలు రాష్ట్రాలు నిలిపివేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. ఐతే బుధవారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఏనుగులదోరి గ్రామంలో ఒకే ఫామ్‌లో భారీగా కోళ్లు చనిపోవడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ప్రీమియం కంపెనీ సహకారంతో నిర్వహిస్తున్న తన కోళ్లఫామ్‌లో ఉన్నట్టుండి 6,400 కోళ్లు ఒకేసారి చనిపోయాయని దాని యజమాని పి.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. వెంటనే కంపెనీ యజమానులకు సమాచారం ఇవ్వడంతో.. వారు చేరుకొని పరిశీలించినట్లు తెలిపారు. ఐతే బర్డ్ ఫ్లూ వల్ల అవి చనిపోలేదని చెప్పినట్లు వెల్లడించారు. కోళ్ల ఫామ్‌కు సంబంధించిన నీటిట్యాంకులో విషపూరిత రసాయనాలు కలిపిన ఆనవాళ్లు దొరికాయని.. ఆ నీరు తాగడం వల్లే కోళ్లు మరణించినట్లు నిర్ధారించారని చెప్పారు. ఐతే ఉత్తరాది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న క్రమంలో.. ఇక్కడ ఒకేసారి అన్ని కోళ్లు మరణించడంతో.. స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. అవి బర్డ్ ఫ్లూ వల్లే మరణించాయని భావించారు. కానీ అదేమీ లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.

 

కాగా, తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్… ఇటీవలే బర్డ్ ఫ్లూపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం ముందే అప్రమత్తమయిందని.. సరిహద్దు జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని మంత్రులు ఆ సందర్భంగా చెప్పారు. అవసరమైన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. బర్డ్‌ఫ్లూ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఈ వ్యాధితో ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. చికెన్, కోడిగుడ్డు తింటే బర్డ్‌ఫ్లూ రాదని.. వైద్య నిపుణులు కూడా ఇదే చెబుతున్నారని వెల్లడించారు.

 

కరోనా సంక్షోభం నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని… ఇలాంటి సమయంలో మళ్లీ బర్డ్ ఫ్లూపై భయాందోళనలు అవసరం లేదని ప్రజలకు సూచించారు. పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పౌల్ట్రీ రైతులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. వారికి ప్రభుత్వం సలహాలు సూచనలు ఇస్తోందని మంత్రి తలసాని చెప్పారు. వలస పక్షుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here