తెలంగాణ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి కేటీఆర్ ముందే.
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి కేటీఆర్ ముందే.

మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) త్వరలోనే తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్’ అని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పద్మారావు. ఆ సమావేశంలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. మంత్రి వేదికపై ఉన్న సమయంలోనే పద్మారావు ఇలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.” మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అతి త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారు. మా శాసన సభ, రైల్వే కార్మికుల తరపున, అందరి తరపున కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెబుతున్నాం.” అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. కాసేపటి క్రితం మంత్రి గంగుల కమలాకర్ కూడా మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడని.. తండ్రికి దగ్గ తనయుడు అని కొనియాడారు. ఆయన్న ముఖ్యమంత్రి చేస్తే.. అందరం ఒకే మాటపై ఉండి మద్దతు తెలుపుతామని తెలిపారు..

 

‘” ముఖ్యమంత్రి ఎవరు అనేది మా పార్టీ అంతర్గత విషయం. మా పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది మా బాస్ కేసీఆర్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేం శిరసావహిస్తాం. ఒకవేళ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావిస్తే మేం అందరం ఒకే మాటపై ఉండి మద్దతిస్తాం. కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడు. తండ్రికి దగ్గ తనయుడు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా? లేదా ? అన్నది బీజేపీకి అవసరం. ఇది మా పార్టీ అంతర్గత విషయం.” అని గంగుల కమలాకర్ అన్నారు.

 

ఇటీవల టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని వ్యాఖ్యానించారు. బుధవారం మరో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సైతం అదే రకంగా స్పందించారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంది అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇలా వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేటీఆర్ పట్టాభిషేకానికి అంతా సిద్ధమవుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here