అర్హులకు ఓటు హక్కు అవకాశం కల్పించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం వల్ల 18 ఏళ్లు నిండిన మూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఓటు వేసే అవకాశం కల్పించకుండా ఇంతమందికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ నెల 23న ఎన్నికల కమిషన్ నిర్వహించిన పత్రికా సమావేశంలో.. 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం వల్ల 3లక్షల మం ది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నదని పిటిషన్లో ప్రస్తావించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఆదివారం ఈ పిటిషన్ నంబర్ కాలేదు.