విశాఖలో.. నయా గ్యాంగ్‌!
విశాఖలో.. నయా గ్యాంగ్‌!

పోలీసులమంటూ బెదిరించి ఆభరణాలను తస్కరించే గ్యాంగ్‌ విశాఖపట్నం నగరంలో హల్‌చల్‌ చేస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఇద్దరి నుంచి ఇలా ఆభరణాలను చోరీ చేసి ఉడాయించడంతో పోలీసులు ఇది ఇరానీ గ్యాంగ్‌ పనేనని అనుమానిస్తున్నారు. కొంతకాలం కిందట ఇదే తరహా దోపిడీలను పోలీసు యంత్రాంగం చాకచక్యంగా అరికట్టగలిగింది. ఇటీవల మళ్లీ ఇలాంటి సంఘటనలే చోటుచేసుకోవడంతో ఆ గ్యాంగ్‌లోని పాత నేరస్థులపనే అని భావిస్తోంది.

ఇవీ సంఘటనలు

గాజువాకలోని అప్పికొండకాలనీకి చెందిన స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి రామకృష్ణ (నానాజీ) (60) ఈ నెల 21న విధులకు హాజరయ్యేందుకు కూర్మన్నపాలెం రహదారిలో వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆపారు. తాము పోలీసులమని, ఈ ప్రాంతంలో దొంగతనం జరిగిందంటూ అతడి జేబులు తనిఖీ చేశారు. అనంతరం మెడలోని చైన్‌, చేతి ఉంగరాలను తీసి ఒక రుమాలులో మూట కట్టుకోవాలని సూచించారు. పోలీసులే కదా అని వారు చెప్పినట్టే చేయగా, మరోసారి చూడాలంటూ అతని నుంచి మూటను తీసుకుని బైక్‌పై పరారయ్యారు.

మధురవాడకు చెందిన వెంకటరమణ (75)బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఈనెల 22న బిర్లా కూడలి వద్ద బస్సు దిగి నడిచి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి స్పెషల్‌ బ్రాంచి పోలీసులమని, ఆభరణాలతో ఒంటరిగా వెళ్లడం ప్రమాదమంటూ అతని వద్ద వున్న చైన్‌, ఉంగరాలను తీసి రుమాలులో మూటకట్టి ఇచ్చి జేబులో పెట్టుకోమన్నారు. కొంతదూరం వెళ్లిన అతడు అనుమానంతో మూట విప్పి చూడగా ఆభరణాలు లేవు. దీంతో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుమానం రాకుండా…

ఈ తరహా చోరీలు ఇరానీ గ్యాంగ్‌ పనేనని, పోలీసులమంటూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నట్టు నటించి వారి వద్ద ఉన్న ఆభరణాలను తస్కరిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌తోపాటు తెలుగురాష్ట్రాల్లోని కొంతమంది పాత నేరస్థులే ఈ తరహా నేరాలకు పాల్పడుతుంటారు. వీరంతా ఎత్తుగా, బలిష్టంగా ఉండడంతో పోలీసులమని చెప్పినప్పటికీ ఎవరికీ అనుమానం కలగదు. పైగా పోలీసులను తలపించేలా ఖాకీ ప్యాంటు ధరించి ఉంటారు. కొందరైతే తమ వాహనాలకు పోలీస్‌ అనే బోర్డు కూడా పెట్టుకుని మోసాలకు పాల్పడుతుంటారు. గతంలో దోపిడీలకు పాల్పడిన ఇరానీగ్యాంగ్‌ సభ్యులు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటే… ఇటీవల జరిగిన రెండు ఘటనల్లోనూ నిందితులు వృద్ధులైన మగవారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడడం విశేషం. కొంతకాలం కిందట ఇలాంటి నేరాలు ఎక్కువగా జరగడంతో పోలీసులు గ్యాంగ్‌ మూలాలను పెకిలించి, నిందితులను జైలుకు పంపించడంతో అడ్డుకట్ట పడింది. తాజాగా మళ్లీ మొదలయింది.

పోలీసులు ఆభరణాలను అడగరు

పోలీసులు ఎప్పుడూ ప్రజల ఆభరణాలను తీసి ఇవ్వాలని అడగరనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఇలా అడిగితే అనుమానించి డయల్‌ 100కి ఫోన్‌చేయాలి. నగరంలో జరిగిన రెండు నేరాలూ పాతనేరస్థుల పనేనని భావిస్తున్నాం. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటాం. పాతనేరస్థులు జైలు నుంచి బయటకు రావడంతో ఇటీవల ఈ రెండు కేసులు నమోదయ్యాయి. సీపీ, డీసీపీ ఆదేశాల మేరకు నేరస్థులను గుర్తించే పనిలో ఉన్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here