కంగనా..అన్నం పెట్టే రైతన్నలు ఉగ్రవాదులా?
కంగనా..అన్నం పెట్టే రైతన్నలు ఉగ్రవాదులా?

మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఆఖరుకు తినేది ఆ మూడు ముద్దలే. ఆ మూడు ముద్దలు నోట్లోకి వెళ్లలన్నా.. మనం కడుపునిండాలన్నా.. మనకు అన్నం పెట్టే రైతన్నలు బాగుండాలి. కానీ వారి వ్యవసాయాన్ని వారు చేసుకోనివ్వకుండా.. వారి పంటను వారు అమ్ముకోనివ్వకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ మూడు కొత్త వ్యవసాయ చట్టాలు చేసింది. రైతులను వారి మానాన వారిని వదిలేస్తే వారి కష్టాలు ఏదో వారు పడుతారు. కానీ కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్న ఈ చట్టాలున్నాయన్న రైతుల ఆవేదనను కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్టించుకోలేదు.

దున్నపోతు వానపడ్డ చందంగా రెండు నెలలుగా కొట్లాడుతున్నా.. మైనస్ డిగ్రీల చలిలో రైతులు వణుకుతున్నా.. పలువురు చనిపోయినా కనికరం లేని కఠిన మోడీ ప్రభుత్వం అస్సలు సాగుచట్టాలను వెనక్కి తీసుకోలేదు. దీంతో అన్నం పెట్టే రైతన్న రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి దేశంలో ఏర్పడింది.

అయితే రైతు చేస్తేనే మనం అంతా తింటున్నాం.. బతుకుతున్నాం.. అలాంటి రైతన్నల కష్టాలు.. వారికి మద్దతిచ్చే వారిపై చులకనగా మాట్లాడే వారిని ఏమనాలి? అసలు మనుషులా? మానవత్వం లేని మృగాలా అనిపించకమానదు. ఏ సమస్యనైనా లోతుల్లోకి చూడకుండా ‘గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు’ వెళ్లిపోయే బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ కూడా తాజాగా రైతులపై వారికి మద్దతిచ్చే వారిపై తీవ్ర వ్యాఖ్యలుచేశారు. అసలు వారిని అనడానికి ఆమెకు నోరు ఎలా వచ్చిందో అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఢిల్లీలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నిన్న ఏకంగా ఢిల్లీపై ట్రాక్టర్లతో దండెత్తి ఎర్రకోటపై రైతు జెండా ఎగురవేశారు. రైతుల ఆందోళన ఆవేదనపై దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. అయినా కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం రైతు చట్టాలపై వెనకడుగు వేయడం లేదు.

ఈ క్రమంలోనే రైతుల ఆందోళనకు మద్దతు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. అయితే పరమ బీజేపీ భక్తులు.. ఆరాధ్యులు మాత్రం దేశానికి అన్నం పెట్టే రైతుల ఆక్రందన.. ఆవేదనపై నోరు పారేసుకుంటున్నారు.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ రైతులపై నోరుపారేసుకున్నారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్రరూ ఉగ్రవాదులేనని వ్యాఖ్యానించింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతలపై స్పందించిన కంగనా.. ‘ఈ ఆందోళనలతో మనం ప్రపంచం ముందు నవ్వుల పాలవుతున్నాం.. దేశమంటే గౌరవం లేకుండా పోయింది. రైతులుగా పిలవబడుతున్న వారికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరు ఉగ్రవాదులతో సమానం.. వారిని జైల్లో వేయాలి’ అని కంగనా వివాద్సాద వ్యాఖ్యలు చేశారు.

అన్నం పెట్టే రైతన్నలు కడుపు కాలి రోడ్డెక్కితే అది కంగనకు అవమానంగా కనిపించిందట.. ప్రపంచం ముందు నవ్వుల పాలవుతున్నామట.. అదే ప్రపంచం ముందు పరువు పోకుండా ఆ మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోమని కేంద్రాన్ని కోరే దమ్ము కంగనారనౌత్ కు ఎందుకు లేదని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రైతులంటే లోకువ.. బీజేపీ అంటే అంత ప్రేమ ఎందుకని నిలదీస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here