రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు.. కానీ ఇప్పుడు మాత్రం నా ఫీలింగ్స్..! ట్రోల్స్‌పై సమంత రియాక్షన్
రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు.. కానీ ఇప్పుడు మాత్రం నా ఫీలింగ్స్..! ట్రోల్స్‌పై సమంత రియాక్షన్

గత కొన్ని రోజుల క్రితం సమంతపై ట్రోల్స్ నడిచిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన చిట్ చాట్‌లో ఈ ఇష్యూ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర రిప్లై ఇచ్చింది సమంత. తనపై వస్తున్న ట్రోల్స్ చూస్తూనే నవ్వొస్తోందని ఆమె చెప్పింది.
తెలుగు హీరోయిన్లందరిలో సోషల్ మీడియా ఖాతాల్లో ఎక్కువ యాక్టివ్ ఎవరంటే ముందుగాసమంత పేరే గుర్తొస్తుంటుంది. అందుకే సోషల్ మీడియాకు సమంతకు విడదీయరాని బంధం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాగచైతన్యను పెళ్ళాడి అక్కినేని వారింట అడుగుపెట్టాక సామజిక మాధ్యమాల్లో సమంత క్రేజ్ మరింత పెరిగింది. ఎప్పటికప్పుడు తన, తన ఫ్యామిలీ విశేషాలు షేర్ చేస్తున్న ఆమె కొన్నిసార్లు ట్రోల్స్ బారిన కూడా పడింది. అయితే అలా ట్రోల్స్ జరిగినప్పుడు తన ఫీలింగ్స్ ఏంటనే విషయాన్ని తాజాగా జరిగిన చిట్ చాట్‌లో బయటపెట్టింది సామ్.

గతంలో హీరోయిన్లంటే.. పెళ్లి తర్వాత సైలెంట్ కావడం, సినిమాల్లో గానీ, సామజిక మాధ్యమాల్లో గానీ ఎక్కువగా కనిపించకపోవడం చూసాం. కానీ, తాను అందుకు పూర్తిగా భిన్నం అని నిరూపిస్తూ పెళ్లయ్యాక జోష్ పెంచేసింది అక్కినేని కోడలు సమంత. సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై హాట్ ఫొటోలు షేర్ చేయడంలోనూ ఏ మాత్రం వెనక్కితగ్గకుండా దూసుకుపోతోంది. అయితే ఈ మధ్యకాలంలో సమంత ఇష్యూ ఒకటి హాట్ టాపిక్ అయిన సంగతి మనందరికీ తెలుసు.

ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ మెన్- 2’ ప్రమోషన్స్‌లో భాగంగా నెట్టింట రచ్చ చేస్తున్న సమంత.. ఇటీవల తన డిజైనర్ ప్రీతమ్ ఒళ్లో కాళ్లు పెట్టి సోఫాలో హాయిగా ముచ్చట్లు పెడుతున్న ఫోటో షేర్ చేయడమే గాక ఐలవ్యూ అనే కామెంట్ చేసి ట్రోల్స్ బారిన పడింది. దీంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది సామ్. ఈ మొత్తం ఇష్యూ జనాల్లో గత మూడు నాలుగు రోజులుగా చర్చల్లో నిలుస్తున్న నేపథ్యంలో తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ విషయమై సమంత రియాక్ట్ అయింది.

అభిమానులతో చిట్ చాట్ చేస్తుండగా.. సోషల్ మీడియాలో మీపై వచ్చే ట్రోలింగ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఫన్నీ రిప్లై ఇచ్చింది సమంత. తాను ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని అని.. కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి చూస్తుంటే నవ్వొస్తుంటుంది.. ట్రోల్ చేస్తున్నారంటే మనం ఎంతో సాధించేశామని అర్థమే కదా అనేసింది సమంత. అంటే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ప్రస్తుతం తాను పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పకనే చెప్పేసింది సామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here