ఎర్రకోట దగ్గర జెండా ఎగురవేస్తుంటే కాల్చేయలేదేంటి?
ఎర్రకోట దగ్గర జెండా ఎగురవేస్తుంటే కాల్చేయలేదేంటి?

ఒక ప్రశ్న పలువురిని తొలిచేస్తుంది. ఎర్రకోట దగ్గర జాతీయ జెండాకు సమానంగా.. ఒక మతపరమైన జెండాను ఎగురవేయటానికి మించిన తెంపరితనం మరొకటి ఉండదు. ఎంత నిరసన అయినా.. ఎంతటి ఆందోళన అయినా దానికి హద్దులు ఉంటాయి కదా? ఇవాళ ఎర్రకోట దగ్గర చేసిన పనే.. రేపొద్దున పార్లమెంటు భవనం మీదకు ఎక్కి మరో తరహా జెండాను ఎగురవేస్తే? ఈ ప్రశ్న ఉలిక్కి పడేలా చేస్తుంది? అలా ఎలాజరుగుతుంది? అన్న ప్రశ్న కూడా వస్తుంది. అమెరికాలో ట్రంప్ పార్టీ మద్దతుదారుల బరితెగింపును గుర్తు చేసుకుంటే.. ఏదీ అసాధ్యం కాదన్నది మర్చిపోకూడదు.
ఈ మధ్యనే ఇలాంటి ఉదంతం జరిగినప్పుడు.. ఎర్రకోట దగ్గర కూడా ఏదో ఒక అనుచిత కార్యక్రమానికి తెర తీసే ప్రమాదం ఉందన్న విషయాన్ని కేంద్రం ఎందుకు గుర్తించలేదు? నిఘా వర్గాలు ఏమయ్యాయి? ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పినప్పుడు.. అందుకు తగ్గట్లే వందలాది ట్రాక్టర్లు పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు.. ఇలాంటిదేదో జరుగుతుందన్న ఆలోచన ఎందుకు చేయనట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఎర్రకోట దగ్గర జెండా ఎగురవేయటాన్ని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు ఏమీ తమ విజయంగా చెప్పుకోలేదు. అందుకు క్రెడిట్ తీసుకోవటానికి ఇష్టపడలేదు. నిజానికి ఈ ఉదంతంపై ఆందోళనను వ్యక్తం చేశాయి. అనుమానాలు.. సందేహాల్ని తెర మీదకు తీసుకొచ్చాయి. అలా వచ్చిన సందేహాల్లో భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ కార్యదర్శి రాకేశ్ తికాయత్ సంధిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో చోటు చేసుకున్న హింసా విధ్వంసాల వెనుక ప్రభుత్వ.. పోలీసుల కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.చట్టాల విషయంలో పంజాబ్ ను మిగిలిన దేశం నుంచి వేరు చేసి చూపటమే లక్ష్యమని ఘాటు ఆరోపణ చేశారు. ఎవరో కొందరు వచ్చి ఎర్రకోటలో జొరపడటం.. ఒక వ్యక్తి జెండా పోల్ ఎక్కి వేరే పతాకాన్ని ఎగరవేయటాన్ని ఆయన తప్పు పడుతున్నారు.

‘‘పోలీసులు ఎందుకు చూస్తూ ఉండిపోయారు? కాల్పులు ఎందుకు జరపలేదు? ఈ పని చేసింది ఆందోళన ముసుగులో విద్రోహ శక్తలు’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కమిటీ చేత విచారణ జరిపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిజమే.. ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు.. కాళ్ల మీద కాల్పులు జరిపితే సరిపోయేది కదా? లేదనుకుంటే..కనీసం గాల్లో అయినా కాల్పులు జరపొచ్చు కదా? అలాంటివేమీ ఎందుకు జరగనట్లు? అన్న సందేహం రాక మానదు. ఇలాంటి వాటికి సమాధానాలు చెప్పే వారెవరు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here